కరోనా వ్యాక్సిన్ చివరి దశ ప్రయోగాలను భారీ స్థాయిలో నిర్వహిస్తోంది అగ్రరాజ్యం అమెరికా. 30వేల మంది వలంటీర్లపై సోమవారం నుంచి క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తోంది. అయితే ఈ వ్యాక్సిన్ వైరస్ నుంచి పూర్తిగా రక్షణ కల్పిస్తుందని కచ్చితంగా చెప్పలేమని అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ తెలిపింది.
వ్యాక్సిన్ ఊహించిన ఫలితాలను ఇస్తుందో లేదో ఆధారాలతో తెలుసుకునేందుకు వలంటీర్లకు డోసులు ఇస్తారు. రెండు డోసుల అనంతరం ఫలితాలను సమీక్షిస్తారు. వారి దినచర్యలను గమనించిన అనంతరం వ్యాక్సిన్ డోసులు ఇచ్చిన వారిలో ఎవరు ఎక్కువ వైరస్ బారిన పడుతున్నారో నిర్ధరిస్తారు.
చైనా, ఆక్స్ఫర్డ్ యూనివర్సీటీలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ల తుది దశ ప్రయోగాలను ఇప్పటికే ప్రారంభించారు. వైరస్ ప్రభావం అధికంగా ఉన్న బ్రెజిల్ సహా ఇతర దేశాల్లో కొద్ది మందిపై ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.
ఏ వ్యాక్సిన్‌కైనా..
ఇతర దేశాలు తయారు చేసిన ఏ వ్యాక్సిన్‌నైనా తాము వినియోగించాలంటే ముందుగా స్థానికంగా 30వేల మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాకే నిర్ణయం తీసుకుంటామని అమెరికా చెబుతోంది. ఎన్ని వ్యాక్సిన్లకైనా ఇవే నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. దీని ద్వారా వ్యాక్సిన్ తమకు ఏ మేర రక్షణ కల్పిస్తుందో తెలుస్తుందని పేర్కొంది.
వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు అమెరికాలో దాదాపు లక్షా 50వేల మంది వలంటీర్లు ఆన్లైన్లో నమోదు చేసుకున్నారని వైరాలజిస్ట్ డా.లారీ కోరే తెలిపారు.
ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ తుదిదశ ప్రయోగాలను ఆగస్టులో భారీ స్థాయిలో ప్రారంభించనున్నారు. జాన్సన్ అండ్ జాన్సన్ రూపొందించిన వ్యాక్సిన్‌ను సెప్టెంబరులో, నోవా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ను అక్టోబరులో మొదలుపట్టనున్నారు.
ఈ వ్యాక్సిన్లు అనుకున్న ఫలితాలిస్తే అందుబాటులోకి రావడానికి ఎంతలేదన్నా కొన్ని నెలలు పడుతుంది. అమెరికా సహా ఇతర సంపన్న దేశాలు ఇప్పటికే మిలియన్ల సంఖ్యలో డోసులు సిద్దం చేయాలని ఆర్డర్లు ఇచ్చాయి.