దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటిన వేళ వివిధ రాష్ట్రాల గవర్నర్లతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆందోళనలు అదుపు చేయడంలో గవర్నర్లు విఫలమయ్యారని మండిపడ్డారు. బలహీనులైన గవర్నర్ల వల్లే ఆందోళనలు సద్దుమణగడంలేదని ఆరోపించారు. నేషనల్ గార్డ్స్‌ను ఆయా రాష్ట్రాలు బరిలోకి దించకుంటే తాను వేలాది మంది సాయుధ బలగాలను రంగంలోకి దించుతానని హెచ్చరించారు.
"మీరు (గవర్నర్లను ఉద్దేశించి) నిరసనకారులను గుర్తించి అరెస్టు చేయాలి. వారిని 10 ఏళ్లపాటు కారాగారంలో బంధించాలి. అప్పుడే ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ఉంటాయి. వాషింగ్టన్లో ఇప్పుడు మేం అదే చేయబోతున్నాం. ప్రజలు ఇదివరకు చూడని విధంగా మేం చర్యలు తీసుకోబోతున్నాం."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
నల్లజాతీయుడైన జార్జి ఫ్లాయిడ్ మృతితో అమెరికా అట్టుకుడుకుతున్న వేళ శ్వేతసౌధం కీలక ప్రకటన చేసింది. నిరసనల్లో భాగంగా చేస్తోన్న హింస, దోపిడీ, అరాచకత్వాలను సహించేది లేదని స్పష్టం చేసింది. శాంతియుతంగా నిసరన తెలిపే హక్కు ప్రజలకు ఉందని అయితే, కొన్ని రోజులుగా జరుగుతున్న ఆందోళనలు ఈ కోవకు చెందినవి కాదని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల గవర్నర్లందరూ కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
"అమెరికా వీధుల్లో జరుగుతున్నవి ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇవి నిరసనలు కావు, నేరపూరిత చర్యలు. ఇవన్నీ అమెరికన్ పౌరులకు హానికలిగించే నేరాలు."
-కెయిలీ మెక్ఎనానీ, శ్వేతసౌధ ప్రెస్ సెక్రెటరీ
మరోవైపు ట్రంప్ విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో శ్వేతసౌధం ప్రాంగణం నిరసనలతో హోరెత్తింది. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు.
ఇదీ చదవండి: నేడు సీఐఐ వార్షికోత్సవంలో పాల్గొననున్న ప్రధాని