నల్లజాతీయుడైన జార్జి ఫ్లాయిడ్ హత్యపై అమెరికా అట్టుడికింది. దేశంలో జాత్యాంహకార ధోరణి, పోలీసుల వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో నిరసనలు పెల్లుబుకాయి. అయినా అమెరికాలో తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. అయితే, జార్జి ఫ్లాయిడ్ మరణానికి ముందు కూడా ఊపిరాడకపోవటం వల్ల ఓ నల్లజాతీయుడు మరణించినట్లు తాజాగా బయటపడింది.
పశ్చిమ న్యూయార్క్‌లోని రొచెస్టర్లో డేనియల్ ప్రూడ్ అనే వ్యక్తికి పోలీసులతో ఘర్షణ తలెత్తింది. తీవ్రంగా గాయపడిన ప్రూడ్.. మార్చి 30న ప్రాణాలు వదిలాడు. అయితే, అతని కుటుంబ సభ్యులు బుధవారం ఈ హత్య గురించి మీడియాకు చెప్పటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఘటన జరిగిన సమయంలో పోలీసుల 'బాడీ కెమెరాలు' చిత్రీకరించిన దృశ్యాలు, లిఖితపూర్వక నివేదికలను ప్రభుత్వం నుంచి సేకరించి బహిర్గతం చేశారు.
అసలేం జరిగింది?
ఈ వీడియోలో ప్రూడ్‌ను దారుణంగా హింసించినట్లు తెలుస్తోంది. ప్రూడ్‌ను కింద కూర్చుని చేతులు వెనక్కు పెట్టుకోవాలని పోలీసులు ఆదేశించారు. అయితే, అందుకు నిరాకరించిన ప్రూడ్ వారిపై అసహనం వ్యక్తం చేశాడు. తన దుస్తులు విప్పేశాడు.
అప్పటికే చేతికి బేడీలు వేసిన పోలీసులు.. ప్రూడ్ తలకు ఉమ్మివేయటానికి ఉపయోగించే ప్లాస్టిక్ కవర్‌ను తొడిగి రెండు నిమిషాల పాటు అదిమిపట్టారు. ముసుగు తీయమని ప్రూడ్ ఎంత అభ్యర్థించినా పోలీసులు కనికరించలేదు. ప్రూడ్ నోరు మూయించేందుకు ఓ అధికారి.. అతని తలపై కొట్టాడు. మరో అధికారి అతని వీపుపై మోకాలిని పెట్టి అదిమిపట్టాడు.
ఫలితంగా ఊపిరాడక ప్రూడ్ అపస్మారక స్థితికి వెళ్లాడు. అతని నోటి నుంచి నీరు రావటాన్ని గమనించిన పోలీసులు.. ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వారం రోజుల తర్వాత మరణించాడు ప్రూడ్.
మానసిక ఆరోగ్యం సరిగా లేదు..
చికాగోలో ఉండే డేనియల్ సోదరుడు జో ప్రూడ్.. అతనికి మానసిక ఆరోగ్యం సరిగా లేదని తెలిపాడు. ఇదే విషయమై అత్యవసర నంబరు 911కి కాల్ చేసి పోలీసులకు వివరించాడు. డేనియల్ ప్రూడ్‌ను వెతికే క్రమంగా ఈ ఘటన చోటుచేసుకుంది.
దీనిపై న్యూయార్క్ అటార్నీ జనరల్ విచారిస్తున్నారు.
ఇదీ చూడండి: 'ఫ్లాయిడ్ మరణం ప్రపంచాన్ని మారుస్తోంది'