తీవ్ర రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వెనిజువెలాను మరో సమస్య చుట్టుముట్టింది. శుక్రవారం వెనిజువెలా అంధకారంలో మునిగిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయిఈ పరిస్థితి దాపురించింది. గడిచిన కొన్ని సంవత్సరాల్లో ఇదే అతి పెద్ద విద్యుత్ కోత.
దేశం మొత్తం:
దేశంలోని మొత్తం 23 రాష్ట్రాల్లో 22 రాష్ట్రాలు అంధకారంలో మునిగిపోయాయి. రాజధాని కరాకస్లోనూ విద్యుత్ అంతరాయం కలిగింది. గ్రిడ్ పై భారం అధికమైఒక్కసారిగా సరఫరా వ్యవస్థ కుప్పకూలింది.
స్తంభించిన రవాణా:
వెనిజువెలాలో ముఖ్య రవాణ వ్యవస్థ సబ్వే. ఈ సబ్‌వేలు విద్యుత్ ఆధారంగా పనిచేస్తాయి. విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడి... సబ్వే సేవలు నిలిచిపోయాయి. వేల మంది ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయక గందరగోళం ఏర్పడింది. వేలసంఖ్యలో కార్లు రోడ్లపై నిలిచిపోయాయి. విధి లేని పరిస్థితుల్లో కొంత మంది కాలినడకన ఇళ్లకు చేరుకున్నారు.
చీకట్లోనే వైద్యం:
విద్యుత్ కోతప్రభావం ఆరోగ్య సేవలపైనా పడింది. రాజధాని కరాకస్‌లోని ప్రముఖ ఆసుపత్రి అవిలా క్లినిక్‌లోని ప్రసవ వార్డులో కొవ్వొత్తుల సహాయంతో వైద్యం చేస్తున్నారు.
అగ్రరాజ్యం కుట్రే:
వెనిజువెలా ప్రభుత్వం మాత్రం ఇది ముమ్మాటికీ అగ్రరాజ్యం కుట్రేనని అంటోంది. అమెరికా తమపై విద్యుత్ యుద్ధం చేస్తోందని వెనిజువెలా ప్రభుత్వం ఆరోపించింది.
ఆ సెనేటర్దే కీలక పాత్ర:
సమాచార మంత్రి జార్జ్ రోడ్రిగ్జ్ మితవాదపక్ష తీవ్రవాదులు దేశంలో అల్లర్లు సృష్టించడానికి ఫ్లోరిడా రిపబ్లికన్ సేనేటర్ మార్కో రుబియె నుంచి డబ్బులు తీసుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కుట్ర వెనుక మార్కో రుబియె ఉన్నారని ఆయన ఆరోపించారు.
దేశ ప్రజలు కొంత కాలం సహనంతో ఉండాలని మంత్రి కోరారు. పరిస్థితి చక్కబడే వరకు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. ఒక్క విద్యుత్ సమస్యే కాదు. ఆహారం, మందుల కొరత ముంచుకొస్తోంది.
నా ఫోన్లో తప్పు బటన్ వల్లే సమస్య అంతా..
వెనిజువెలా ప్రభుత్వ ఆరోపణలపై స్పందించారు ఫోర్లిడా సెనేటర్ రుబియె ట్విటర్లో స్పందించారు.
" వెనిజువెలా ప్రజలారా నన్ను క్షమించండి. నా ఆపిల్ ఫోన్లో ఎలక్ట్రానిక్ వార్ యాప్‌లో తప్పు బటన్ నొక్కడం వల్లే మీ దేశంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది" అంటూ ట్వీట్ లో ఎగతాళి చేశారు.