కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న విషయం తెలిసిందే. నవంబర్ కన్నా ముందే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని మరోమారు ఉద్ఘాటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వచ్చే మూడు, నాలుగు వారాల్లోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌లు తుది దశ ప్రయోగాలకు చేరుకున్నాయి. వీటిలో కొన్నింటిని అత్యవసర వినియోగానికి రష్యా, చైనా వంటి దేశాలు అనుమతులు కూడా ఇచ్చాయి. ఇక ఈ వ్యాక్సిన్‌లు మరికొద్ది నెలల్లోనే ప్రజావినియోగానికి అందుబాటులోకి వస్తాయని అంతర్జాతీయంగా పలు ప్రకటనలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘కరోనా వ్యాక్సిన్ పొందేందుకు చాలా దగ్గరకు చేరుకున్నామని వెల్లడించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.
"కరోనా వ్యాక్సిన్ పొందేందుకు చాలా దగ్గరకు చేరుకున్నాం. రానున్న కొన్ని వారాల్లోనే అది అందుబాటులోకి రానుంది. అది మూడు, నాలుగు వారాల్లోపే రావచ్చు. ప్రభుత్వంలో వేరేవారు ఉంటే, వ్యాక్సిన్ రావడానికి మరిన్ని సంవత్సరాలు పట్టేది. కానీ, ఎఫ్‌డీఏతో పాటు మరిన్ని అనుమతులతో వేగంగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెస్తున్నాం."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఓటర్లతో ముఖాముఖి నిర్వహించారు. ఆ సమయంలో వ్యాక్సిన్ గురించి ఓటర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ట్రంప్ ఈ విషయం చెప్పారు. వ్యాక్సిన్ వచ్చినప్పటికీ కరోనా మహమ్మారి దానంతట అదే మాయమవుతుందని ట్రంప్ చెప్పడం కొసమెరుపు.
విమర్శలు...
నవంబర్ మూడో తేదీన జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందే వ్యాక్సిన్ తీసుకురావడం కోసం ఎఫ్‌డీఏ మీద వైట్‌హౌజ్ ఒత్తిడి తెస్తోందనే విమర్శలు పెరిగిపోయాయి. ఈ విషయంపై ఇప్పటికే వైట్‌హౌజ్ క్లారిటీ ఇచ్చింది. అయితే, ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో శాస్త్రీయంగా నిరూపితమయ్యే వరకూ దీన్ని విడుదల చేయమని ఆస్ట్రాజెనికాతోపాటు వ్యాక్సిన్ తయారుచేస్తోన్న తొమ్మిది సంస్థలు ప్రతిజ్ఞ చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో అమెరికాలో వ్యాక్సిన్ విడుదలపై ట్రంప్ ప్రకటన ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఇదీ చూడండి: 'కరోనా ముప్పును ఎన్నడూ విస్మరించలేదు'