మానవహక్కుల ఉల్లంఘన, షిన్జియాంగ్ ప్రాంతంలోని ఉయ్ఘర్ ముస్లింలపై మారణహోమానికి సంబంధించి చైనా తీరును తప్పుబట్టారు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్. ఈ అంశానికి సంబంధించి చైనాను తప్పక ప్రశ్నిస్తామని అన్నారు.
ఇప్పటికే చాలా మంది అమెరికా ప్రజాప్రతినిధులు చైనా తీరును దుయ్యబట్టారు. అయితే.. బైడెన్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత మొదటిసారి అమెరికా-చైనా ఉన్నతాధికారులు సమావేశం కానున్న నేపథ్యంలో బ్లింకెన్ చైనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్, జాతీయ భద్రతా సలహాదారు జాక్ సలివన్... మార్చి 18న అలాస్కా వేదికగా చైనా విదేశాంగ మంత్రి యాంగ్ జైచీ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు.
అయితే.. ఇది అంతర్గత విషయని, ఇలాంటి విషయాల్లో అమెరికా జోక్యం సరికాదని చైనా విదేశాంగ ప్రతినిధి జావో లిజియాన్ అన్నారు. చైనా సార్వభౌమాధికారం, భద్రత విషయాలను గౌరవించాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:'టిబెట్లో చైనా జోక్యం తగదు.. ఆ దేశంలో స్వేచ్ఛ ఉండాల్సిందే'