కరోనా వ్యవహారంలో చైనాపై మాటల దాడిని మరింత తీవ్రం చేసింది అగ్రరాజ్యం. వైరస్ ఎక్కడ పుట్టిందో వివరణ ఇవ్వాల్సిన బాధ్యత చైనాపైనే ఉందని స్పష్టంచేశారు అగ్రరాజ్య విదేశాంగ మంత్రి మైక్ పాంపియో. వుహాన్‌లోని పరిశోధనశాలలోనే కరోనా పుట్టిందని ఇతర దేశాలకు తెలియచెప్పేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని వెల్లడించారు.
"అమెరికాలో మరణాలకు, తీవ్ర ఆర్థిక నష్టానికి కారణమైన వారిని మనం జవాబుదారీ చేయాల్సిందే. కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు మేము దౌత్యపరంగా అన్ని దేశాలకు సహకరిస్తున్నాం.
కరోనా వుహాన్‌లోనే పుట్టిందని 2019 డిసెంబర్లో తెలిసినా చైనా దాచిపెట్టిందని ఇతర దేశాలకు తెలియచెప్పేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలు పాటించడంలో చైనా విఫలమైంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కానివ్వం. చైనా సహా మరే దేశమూ ఇలా చేయకుండా తగిన చర్యలు తీసుకుంటాం."
-మైక్ పాంపియో, అమెరికా విదేశాంగ మంత్రి
ఆన్లైన్ ఉద్యమం
చైనాను దోషిగా నిలబెట్టే లక్ష్యంతో రిపబ్లికన్ పార్టీకి చెందిన దిగ్గజ నేత, భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ ఆన్లైన్ ఉద్యమం ప్రారంభించారు. కరోనా సంక్షోభానికి చైనా ప్రభుత్వం బాధ్యత వహించేలా చేయాలని అమెరికా కాంగ్రెస్‌ను కోరుతూ "స్టాప్ కమ్యూనిస్ట్ చైనా" పేరిట పిటిషన్ వేశారు. కొద్దిగంటల్లోనే ఈ ఉద్యమానికి 40 వేల మంది మద్దతు పలికారు.