ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)లో తిరిగి చేరే విషయంపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. సంస్థలో అవినీతికి చరమగీతం పాడి, చైనాపై ఆధారపడకుండా చర్యలు తీసుకుంటేనే ఈ విషయంపై పునరాలోచిస్తామని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓ బ్రయన్ వెల్లడించారు.
'ప్రపంచ ఆరోగ్య సంస్థను సంస్కరించాల్సిన అవసరం ఉంది. అవినీతిని నిర్మూలించి చైనాపై ఆధారపడకుండా ఉంటే తిరిగి చేరే విషయంపై ఆలోచిస్తాం' అని రాబర్ట్ అన్నారు. డబ్ల్యూహెచ్ఓకు అమెరికా సమకూరుస్తున్న 400 మిలియన్ డాలర్ల నిధులను ఇక నుంచి ఇతర అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలకు అందజేస్తామని చెప్పారు.
కరోనా కట్టడిలో డబ్ల్యూహెచ్ఓ పూర్తిగా విఫలమైనందు వల్లే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారని, చైనా చేతిలో కీలుబొమ్మలా మారిందని తీవ్ర ఆరోపణలు చేస్తూ సంస్థ నుంచి వైదొలిగారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. చైనాలో మహమ్మారి విజృంభిస్తుందని తెలిసినా ప్రపంచ దేశాలను డబ్ల్యూహెచ్ఓ అప్రమత్తం చేయలేకపోయిందన్నారు. ఇటీవలే అధికారికంగా బయటకు వచ్చారు.
ఆఫ్రికాలో ఎయిడ్స్ బాధితులను డబ్ల్యూహెచ్ఓ కాపాడటం లేదని, అమెరికానే నిధులు సమకూర్చుతూ అక్కడి ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు రాబర్ట్. ఇక నుంచి నిధులను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు, ఆస్పత్రులకు అందేలా చూస్తామన్నారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ నియంత్రించే అవినీతి సంస్థతో తాము ఉండబోమన్నారు.