అమెరికాలో క్రాఫ్ట్ బీర్‌కు విపరీతంగా ఆదరణ పెరుగుతోంది. అలానే... తయారీదారుల మధ్య పోటీ కూడా ఎక్కువవుతోంది. 30 బిలియన్ డాలర్ల క్రాఫ్ట్ బీర్ వ్యాపారంలో తమ వాటా పెంచుకునేందుకు అమెరికాలోని 7000 మంది తయారీదారులు ఆలోచనలకు పదను పెడుతున్నారు.
పోటీలో నెగ్గాలంటే ఏదో ఒక ప్రత్యేక అంశం కావాల్సిందే. బీర్ అభిమానులను ఆకట్టుకునేందుకు వింత వెరైటీలను సృష్టిస్తున్నారు. మూల పదార్థాలలో మార్పులు చేసి కొత్త ఫ్లేవర్లను మార్కెట్‌కు పరిచయం చేస్తున్నారు.
"ఇదెంతో బాగుంది. ఎప్పుడైనా మనం కొత్త పదార్థాలతో అమోఘమైన బీర్‌ను తయారు చేయొచ్చు. చాలా తమాషా కదా!"
-బెత్ వాథెన్, సిటీ బీర్ స్టోర్ సహ యజమాని
అల్పాహారం నుంచి ఐస్‌క్రీం వరకు అన్ని వెరైటీలనూ తయారు చేస్తున్నారు. చాకొలెట్, అల్లం, గడ్డి... ఇలా బీర్ తయారీకి కాదేదీ అనర్హం అన్నట్టుగా సాగుతోంది. 'వైన్కూప్' అనే కంపెనీ 'గ్రిల్ చేసిన గేదె వృషణాల'తో చేసిన బీర్‌కు ప్రజల్లో క్రేజ్ ఎక్కువ.
"ఈ బీర్ చాలా ప్రాచుర్యం పొందింది. పేరు వినగానే ఒకింత ఆశ్చర్యపోయినా... ఒక్కసారైనా రుచి చూడాల్సిందేనని వస్తున్నారు."
-జాన్ సిమ్స్, వైన్కూప్ సంస్థ యజమాని
నెవాడా రెనోలో జరిగే 'స్ట్రేంజ్ బ్ర్యూ' వార్షిక ఉత్సవాల్లో వింత బీర్లు రుచి చూడొచ్చు.
"బీర్ వీరాభిమానులు తర్వాత ఏంటీ? అనే ఆలోచిస్తారు. అందుకే ఇండియా పేల్ బీర్లు, క్రాఫ్ట్ బీర్లకు ఇంత ఆదరణ పెరుగుతోంది."
-జాక్ కేజ్, స్ట్రేంజ్ బ్ర్యూ నిర్వాహకుడు
అమెరికా క్రాఫ్ట్ బీర్ పరిశ్రమ వేగంగా విస్తరిస్తోంది. గతేడాది 27.6 బిలియన్ డాలర్ల బీర్ అమ్ముడుపోయింది. ప్రస్తుతం 7 శాతం సేల్స్ పెరిగి 30 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది అమెరికా బీర్ వ్యాపారంలో నాలుగోవంతు.
ఇదీ చూడండి: వంట గదిలోకి వచ్చి వైన్ తాగిన మొసలి