అమెరికా వెళ్లాలనుకునే వారు ఇకపై తమ వ్యక్తిగత వివరాలతో పాటు తాము వినియోగిస్తున్న సామాజిక మాధ్యమాల ఖాతా వివరాలనూ అందజేయాలి. ఈ మేరకు ట్రంప్ ప్రభుత్వం శనివారం కొత్త నిబంధన తీసుకొచ్చింది.
తాత్కాలిక పర్యటకులతో పాటు దాదాపు అన్ని వీసా దరఖాస్తులకు ఈ నిబంధన వర్తిస్తుంది. ఇందుకోసం డ్రాప్ డౌన్ మెనూను అందుబాటులోకి తెచ్చారు.
తప్పుడు సమాచారం ఇస్తే అంతే...
సోషల్ మీడియా వినియోగించని వారికోసం ఒక వెసులుబాటు కల్పించారు. తాము ఎలాంటి సామాజిక మాధ్యమాల్లో లేమని తెలిపేందుకు అవకాశం ఇచ్చారు. కానీ వీసా దరఖాస్తుదారు తప్పుడు సమాచారం అందిస్తే ఇమిగ్రేషన్ సమయంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరించారు.
ప్రస్తుతం కొన్ని ప్రముఖ సామాజిక మాధ్యమాలనే డ్రాప్‌డౌన్ మెనూలో ఉంచారు. త్వరలోనే ఇతర సైట్లనూ మెనూలో చేర్చుతామని అధికారులు తెలిపారు.
"అమెరికా రావాలనుకుంటున్న విదేశీయులను తనిఖీ చేసేందుకు ఇది కీలకమైన ముందడుగు. తీవ్రవాదానికి ప్రధాన మార్గంగా సోషల్ మీడియా ఉందని కొన్ని సంవత్సరాలుగా మేము గమనించాం. ఈ నిబంధన అమెరికాలోకి ప్రవేశించాలనుకుంటున్న తీవ్రవాదులు, ఇతర ప్రమాదకర వ్యక్తులను అడ్డుకునేందుకు ఇది కీలక సాధనంగా మారనుంది."
- పోలీసు అధికారి.
వీసా జారీలో తనిఖీలు ముమ్మరం చేసేందుకు 2017 మార్చిలోనే పలు విధానలపై ఆదేశాలు జారీ చేశారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.
ఇదీ చూడండి: హువావేతో జాగ్రత్త: బ్రిటన్‌కు ట్రంప్ హెచ్చరిక