అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ బారినపడి మృతిచెందిన వారి సంఖ్య 3,415కు చేరింది. ఫలితంగా కరోనా మరణాల్లో చైనాను దాటేసింది. ఇక వైరస్ బారిన పడ్డవారి సంఖ్య 1,75,067కు పెరిగినట్లు జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు అమెరికాలో 10లక్షల మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ప్రతిరోజు దాదాపు లక్ష నమూనాలను పరీక్షిస్తున్నామని ఆరోగ్యశాఖ కార్యదర్శి అలెక్స్ అజర్ తెలిపారు.
భారత్‌లో ఉన్న అమెరికన్లను తమ దేశానికి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నామని ట్రంప్ పాలకవర్గం తెలిపింది. ఇప్పటి వరకు 50 దేశాల్లో ఉన్న దాదాపు 25 వేల మంది అమెరికన్లను సొంత దేశానికి తీసుకెళ్లామని వెల్లడించింది. వివిధ దేశాల్లో ఉన్న మరో 9 వేల మంది అమెరికాకు వెళ్లడానికి ఆసక్తి వ్యక్తపరచారని పేర్కొంది.
ఆస్పత్రిగా నౌక..
న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారి చికిత్సకు ఆస్పత్రులే కరవయ్యాయి. దీంతో అక్కడి ప్రభుత్వం ఓ భారీ నౌకను ఆసుపత్రిగా మార్చింది. సోమవారం హడ్సన్ నదిలో ఒడ్డుకు చేరిన ఈ నౌకను రెండు రాష్ట్రాల ప్రజలు నదికిరువైపుల నిలబడి సంతోషంతో స్వాగతం పలికారు. ఇక తీవ్రత ఎక్కువగా ఉన్న మరో రాష్ట్రం కాలిఫోర్నియాలో నాలుగు రోజుల్లో కొవిడ్-19తో ఆస్పత్రుల్లో చేరిన వారి సంఖ్య రెట్టింపయ్యిందని, ఐసీయూలో చేరుతున్న వారి సంఖ్య మూడింతలయ్యిందని గవర్నర్ గావిన్ న్యూసమ్ తెలిపారు.