ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన, కట్టుదిట్టమైన భద్రత, నిత్యం పటిష్ఠ పహారా ఉండే అమెరికా శ్వేతసౌధం తన ప్రవేశానికి అతీతమేం కాదని నిరూపిస్తోంది కరోనా వైరస్. ఏకంగా దాని మెడలు వంచేందుకు ఏర్పాటైన కార్యదళాన్నే భయం గుప్పిట్లోకి నెట్టింది. ఇప్పటికే బృందంలో ఉన్న ఉన్నత స్థాయి శాస్త్రవేత్తలు స్వీయ నిర్బంధంలోకి వెళ్లగా.. తాజాగా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఇంటికే పరిమితం కావాలని నిర్ణయించుకున్నారు.
ఇటీవల తన సిబ్బందిలోని ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయిన నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. నాటి నుంచి ప్రతిరోజు జరుపుతున్న పరీక్షల్లో నెగిటివ్ అని తేలుతున్నప్పటికీ.. వైద్యుల సూచన మేరకు ఇతరులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని అధికారులు తెలిపారు.
ఫౌచీతో సహా..
అంతకుముందు అలర్జీ, అంటువ్యాధుల నివారణ జాతీయ సంస్థ డైరెక్టర్ ఆంథోనీ ఫౌచీ, వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రాల డైరెక్టర్ రాబర్డ్ రెడ్‌ఫీల్డ్, ఆహార, ఔషధ పరిపాలన విభాగం కమిషనర్ స్టీఫెన్ హాన్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు అధికారవర్గాలు తెలిపాయి. వీరంతా కరోనాపై పోరాటం కోసం ఏర్పాటైన శ్వేతసౌధం కార్యదళంలో కీలక సభ్యులు.
ప్రముఖుల సహాయకులకూ..
తాజాగా వీరికి నేతృత్వం వహిస్తోన్న మైక్ పెన్స్ కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఇకపై వీరందరికీ క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహించనున్నారు. అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంక సహాయకురాలికి, మైక్ పెన్స్ మీడియా కార్యదర్శి కేటీ మిల్లర్‌కు ఇప్పటికే కొవిడ్-19 పాజిటివ్ అని నిర్ధరణ అయింది. అంతకుముందు ట్రంప్ సహాయకుల్లో ఒకరు గురువారం మహమ్మారి బారిన పడ్డారు. ఇలా శ్వేతసౌధంలో మొత్తం ముగ్గురు వైరస్ బారినపడ్డ నేపథ్యంలో వీరంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.
ఇదీ చూడండి: శ్వేతసౌధంలో కరోనా వ్యాప్తి- క్వారంటైన్‌కు మరో ముగ్గురు