కరోనా ప్రభావం అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ కుటుంబంపైనా పడింది. దిల్లీలో నివాసముండే ఆమె మామ జీ బాలచంద్రన్ ఇటీవలే 80వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఏటా కుటుంబ సభ్యుల కోలాహలం మధ్య ఘనంగా పుట్టినరోజు వేడుక చేసుకునే ఆయన.. దేశంలో కరోనా పరిస్థితి దృష్ట్యా ఈసారి అలా జరుపుకోలేక పోయారు. అయితే కమలా హారిస్ సహా బంధుమిత్రులంతా తనకు ఫోన్ చేసి బర్త్‌డే విషెస్ చెప్పారని ఓ ఇంటర్వ్యూలో బాలచంద్రన్ వెల్లడించారు.
కమలా హారిస్, ఆమె భర్త డౌగ్ ఎమ్హోఫ్తో ఫోన్లో చాలాసేపు సంభాషించినట్లు బాలచంద్రన్ వివరించారు. అమెరికాలో ఉన్న తన కూతురు బాగోగులను చూసుకుంటానని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని కమల భరోసా ఇచ్చినట్లు చెప్పారు. మార్చి తర్వాత మళ్లీ ఆమెతో మాట్లాడలేదని పేర్కొన్నారు. ఆ తర్వాత నుంచి భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాల్చి వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్న విషయాన్ని గుర్తుచేశారు.
బాలచంద్రన్ పదవీ విరమణ అనంతరం దిల్లీలోని తన నివాసంలోనే ఉంటున్నారు. నిత్యావసరాలు తెచ్చుకోవడానికి మాత్రమే అప్పడప్పుడూ బయటకు వెళ్తారు. అయితే తాను అదృష్టవంతుడినని చెబుతున్నారు. తనను కలిసే వారు ఎవరూ లేనందున స్వయంకృపరాధంతో తప్పితే ఇతరుల వల్ల కరోనా సోకే అవకాశం తనకు లేదని పేర్కొన్నారు. తన సోదరి సరళ కూడా చెన్నైలోని అపార్ట్మెంట్లో ఐసోలేషన్‌లోనే ఉంటున్నారని వివరించారు. ఇద్దరూ కరోనా టీకా తీసుకున్నట్లు వెల్లడించారు.
భారత్‌కు అండగా...
భారత్‌లో కరోనా సంక్షోభం కారణంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు దౌత్యపరమైన, మానవతా సవాళ్లు ఎదురయ్యాయి. అయితే కమలా హారిస్‌కు ఇది వ్యక్తిగత విషయం కూడా. ఆమె తల్లి భారత్‌లోనే జన్మించారు. అధ్యక్ష ఎన్నికల సమయంలోనూ తన చిన్నతనంలో భారత్‌ను పలుమార్లు సందర్శించడం తనపై చాలా ప్రభావం చూపిందని అనేక మార్లు చెప్పారు.
భారత్‌లో కరోనా కల్లోలం సృష్టిస్తున్న సమయంలో మద్దతు ఇవ్వాలని అమెరికా చట్టసభ్యులు బైడెన్ ప్రభుత్వాన్ని పదే పదే కోరారు. తొలుత టీకా ఉత్పత్తికి అవసరమయ్యే ముడి పదార్థాల ఎగుమతిపై నిషేధం విధించిన అగ్రరాజ్యం.. భారత్‌కు సాయం చేయాలని చట్టసభ్యులు ఒత్తిడి చేసినందున ఆ తర్వాత దాన్ని ఎత్తివేసింది. వైద్య పరికరాలు, వ్యాక్సిన్లు అందిస్తామని హామీ ఇచ్చింది.
ఇదీ చూడండి: 'కమలం' విరిసింది.. తులసేంద్రపురం మురిసింది!