అమెరికాలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆ దేశంలోని విద్యా సంస్థలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. కాలిఫోర్నియా, న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ ప్రాంతాల్లో ఇప్పటివరకు 1,037 మందికి వైరస్ సోకగా.. 31 మంది మృతి చెందారు. దీంతో విద్యాసంస్థలను మూసివేసేందుకు నిర్ణయించాయి యాజమాన్యాలు. అదే సమయంలో విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు ఈనెల 23 నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు కేంబ్రిడ్జ్‌లోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
" వైరస్ వ్యాప్తి కారణంగా ఇకపై ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నాం. ఇలా చేయడం వల్ల తరగతి గదుల్లో, భోజనశాలలు తదితర ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు గుమిగూడటాన్ని నివారించవచ్చు."
- హార్వర్డ్ విశ్వవిద్యాలయం, కేంబ్రిడ్జ్
వచ్చేవారం నుంచి..
కొలంబియా, ప్రిన్సిటన్, స్టాన్ఫోర్డ్, ఓహియో స్టేట్, యూనివర్శిటీ ఆఫ్ సౌత్రన్ కాలిఫోర్నియా, యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ తదితర వర్శిటీలు ఇదే విషయాన్ని వెల్లడించాయి. వచ్చే వారం నుంచి ఏప్రిల్ 5 వరకు అన్ని తరగతులు, సెమినార్లు ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు న్యూజెర్సీలోని ప్రిన్స్టన్ యూనివర్శిటీ ప్రకటించింది. ఓహియో విశ్వవిద్యాలయం ఈనెల 30వరకు అన్ని తరగతులను నిలిపివేసింది.
ఇదీ చదవండి: ఇటలీలో కరోనా మరణమృదంగం.. బ్రిటన్ ఆరోగ్య మంత్రికీ వైరస్