జమ్ముకశ్మీర్ భద్రతా ప్రాధాన్యాలను, అక్కడి ప్రజల మానవహక్కులను భారత్ సమతౌల్యం చేసుకోవాలని అమెరికా విజ్ఞప్తి చేసింది. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్ముకశ్మీర్‌లోని ప్రముఖ రాజకీయ నాయకుల్ని నిర్బంధించడంపై ఆందోళన వ్యక్తం చేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో ఉన్నతాధికారి అయిన రాబర్ట్ డెస్ట్రో.. దక్షిణాసియాలో మానవహక్కులు' అంశంపై కాంగ్రెస్ ఉపసంఘంలో ప్రసగిస్తూ 'కశ్మీర్'పై కీలక వ్యాఖ్యలు చేశారు.
"భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, 35 ఏ అధికరణలను ఆగస్టు 5న రద్దు చేసినప్పటి నుంచి.. జమ్ముకశ్మీర్‌లో మానవహక్కులకు సంబంధించి భద్రతా ప్రాధాన్యతలను సమతౌల్యం చేసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోదీ కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేస్తామని ప్రకటించారు. దానిని మేము స్వాగతిస్తున్నాం. అయితే ఇప్పటి వరకు చేపట్టిన చర్యలు మిశ్రమంగా ఉన్నాయి"- రాబర్ట్ డెస్ట్రో, ప్రజాస్వామ్యం, మానవహక్కులు, కార్మికశాఖ సహాయ కార్యదర్శి
ఎన్‌ఆర్‌సీపైనా ఆందోళన
జాతీయ పౌర జాబితా (ఎన్ఆర్సీ) తుది ముసాయిదాపైనా రాబర్ట్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అసోంలోని 1.9 మిలియన్ ప్రజల పౌరసత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తోందని పేర్కొన్నారు.
బాగుంది కానీ..
ప్రస్తుతం కశ్మీర్‌లోని చాలా ప్రాంతాల్లో ఆంక్షలు ఎత్తివేశారని, ల్యాండ్లైన్లు పునరుద్ధరించారని, చాలా మంది ఖైదీలను విడుదల చేశారని రాబర్ట్ డెస్ట్రో కాంగ్రెస్‌కు తెలిపారు. అయితే ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో అంతర్జాలం, మొబైల్ ఫోన్ సేవలు పునరుద్ధరించలేదన్నారు. కశ్మీర్లో ఆరోగ్య సేవలు ఆలస్యమవుతున్నాయని, ఔషధాల కొరత ఉన్నట్లు, వ్యాపారాలు నిలిచిపోయినట్లు నివేదికలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
కమ్యూనికేషన్‌ను స్తంభింపజేయడం వల్ల స్థానిక కార్యకర్తలు, పాత్రికేయులు అక్కడి వార్తలను ఎప్పటికప్పుడు అందించలేకపోతున్నారని రాబర్ట్ తెలిపారు.
అంతా బాగుంది
జమ్ము కశ్మీర్లో మందుల కొరత లేదని, నిత్యవసర సామగ్రి ప్రజలకు అందుబాటులో ఉందని గవర్నర్ సత్యపాల్ మాలిక్ స్పష్టం చేశారు. కనీస సౌకర్యాలు లేవని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. సమాచార సేవలు నిలిపివేయడం.. ఎంతో మంది ప్రాణాలు కాపాడడానికి తోడ్పడిందని మాలిక్ అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి: పాక్ తీరే శాంతి చర్చలకు అవరోధం: అమెరికా