గర్భిణిలే లక్ష్యంగా అమెరికా వీసా నిబంధనలను కఠినతరం చేయనుంది. అమెరికాలో జన్మనివ్వటం ద్వారా తమ పిల్లలకు ఆ దేశ పౌరసత్వం లభిస్తుందన్న ఆకాంక్షతో పలువురు అగ్రరాజ్యానికి వెళుతుంటారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ట్రంప్ ప్రభుత్వం నూతన నిబంధనలను రూపొందించింది.
ఇప్పటినుంచి జన్మనిచ్చేందుకు వచ్చే విదేశీయులు వైద్య చికిత్స కోసం వస్తున్నట్లు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. వాళ్లు చికిత్స నిమిత్తమే అమెరికాకు వస్తున్నట్లు నిరూపించుకోవాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం చికిత్సకు చెల్లించాల్సిన డబ్బు ఉన్నట్లు తెలియజేయాలని స్పష్టంచేశారు. ఈ నిబంధనలు శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నాయి.
వీసా మోసాలతో చిక్కులు..
జన్మనిచ్చేందుకు అమెరికాకు వెళ్లడం న్యాయపరమైనదేనని.. అయితే కొన్నిసార్లు ఇందులో అక్రమాలు బయటపడినట్లు అధికారులు చెబుతున్నారు. బర్త్ టూరిజం పేరుతో వీసా అక్రమాలు, పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్లు తేలిందని వివరించారు. అమెరికాలో జన్మించినవారికి పౌరసత్వం కల్పించటం ట్రంప్ ప్రభుత్వానికి భారంగా మారిందని అన్నారు.
లెక్క తేలట్లేదు..
ఏటా డెలివరీ కోసం అమెరికాకు వచ్చేవారికి సంబంధించి స్పష్టమైన వివరాలు లేకపోవటం అక్కడి ప్రభుత్వానికి చిక్కులు తెస్తోంది. 2012లో సుమారు 36 వేల మంది విదేశీయులు ఇక్కడ జన్మించినట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. వీరిలో రష్యా, చైనాకు చెందినవారే ఎక్కువగా ఉంటారని చెబుతున్నారు.
ఇదీ చదవండి: నేతాజీకి భారతావని రుణపడి ఉంటుంది: మోదీ