అఫ్గానిస్థాన్‌లోని అమెరికా బలగాల ఉపసంహరణకు ఉద్దేశించిన గడువు మే 1న ముగియనున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే రోజున ఈ ప్రక్రియను ప్రారంభించి.. 20 ఏళ్ల కిందట ఉగ్రదాడులు జరిగిన సెప్టెంబర్ 11 నాటికి పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు.
"అమెరికా సైన్యం, అలాగే మా నాటో మిత్రదేశాలు, ఇతర భాగస్వాములు అఫ్గానిస్థాన్ నుంచి బలగాలను ఉపసంహరించుకుంటాయి. అయితే ఉగ్రవాద ముప్పును మాత్రం తేలిగ్గా తీసుకోం. మా బలగాలు, భాగస్వాములపై తాలిబన్ దాడి జరిగితే ప్రతిస్పందనగా అమెరికా తన వద్ద ఉన్న అన్ని సాధనాలను ఉపయోగించడానికి వెనుకడుగు వెయ్యదు''.
-జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
అమెరికా బలగాలు వెనక్కి వెళ్లిపోతున్న నేపథ్యంలో ఇతర దేశాల నుంచి అఫ్గానిస్థాన్‌కు మద్దతు పెంచే విషయాన్ని చర్చిస్తానని బైడెన్ తెలిపారు. ముఖ్యంగా భారత్ సహా పాక్, రష్యా, చైనా, టర్కీల మద్దతు కోరనున్నట్లు వెల్లడించారు.
చర్చల్లో పాల్గొనం..
మరోవైపు.. అఫ్గానిస్థాన్‌లో శాంతి పునరుద్ధరణ ప్రతిపాదనలతో పాటు.. అమెరికన్ దళాల ఉపసంహరణకు ఆరు నెలల జాప్యాన్ని తాలిబన్ తిరస్కరించింది. విదేశీ సైనికులు తమ భూభాగాన్ని వీడేంతవరకు చర్చల్లో పాల్గొనబోమని సంస్థ ప్రతినిధి మహ్మద్ నయీమ్ వార్డక్ వెల్లడించారు.
ఇవీ చదవండి: 11 తీవ్రవాద సంస్థలపై ఆ దేశం నిషేధం