అమెరికాలో టీకా వేయించుకొనేలా ప్రజలను ఒప్పించడానికి నానాతంటాలు పడుతున్నారు. వారిని టీకా తీసుకొనేలా ప్రోత్సహించేందుకు ఓ ఆకర్షణీయమైన పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం ఒహైయో గవర్నర్ మైక్ డివైన్ రాష్ట్ర ప్రజలకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. టీకా వేయించుకొన్నవారిలో అదృష్టవంతులకు ప్రతి వారం 1 మిలియన్ డాలర్లు (రూ.7.3కోట్లు) బహుమానంగా ఇస్తామని ట్వీట్ చేశారు. ఇది 18 నిండి కనీసం ఒక డోసు తీసుకున్నవారికి వర్తిస్తుందని ట్వీట్ చేశారు. అయితే, 'డబ్బు వృథా' అంటూ ఈ నిర్ణయాన్ని కొందరు తప్పుపట్టే అవకాశం ఉందని వెల్లడించారు. 'వాస్తవానికి కరోనా ఉన్న ఈ సమయంలో టీకాలు అందుబాటులో ఉన్నా.. కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోవడం వృథా' అని అభిప్రాయపడ్డారు.
ఈ టీకా లాటరీలో తొలి విజేత పేరును మే 26వ తేదీన ప్రకటించనున్నారు. తర్వాతి వారం విజేతను మొదటి విజేత లాటరీ తీసి నిర్ణయిస్తారని తెలిపారు. 17ఏళ్ల లోపు వారికి మాత్రం మరో ప్రత్యేకమైన లాటరీని ప్రకటించారు. ఇందులో విజేతలకు డబ్బులు ఇవ్వరు.. ఏడాది పాటు స్కూల్ స్కాలర్‌షిప్‌ను ఇవ్వనున్నారు. వాస్తవానికి ఈ రాష్ట్రంలో విద్య అత్యంత ఖరీదైన వ్యవహారం. అమెరికాలో ఇప్పటి వరకు 58.7శాతం మంది ప్రజలు టీకాలు తీసుకొన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
ఇదీ చూడండి: ప్రతిపక్షాలు విఫలం- ప్రధానిగా మళ్లీ ఓలీనే