విశ్వంలోని పదార్థాల సేకరణలో భాగంగా నాసాకు చెందిన వ్యోమనౌక 'ఒసైరిస్-రెక్స్'.. గ్రహశకలం 'బెన్ను'పై విజయవంతంగా దిగింది. భూమికి 20 కోట్ల మైళ్ల దూరంలో గ్రహశకలం నుంచి రాళ్లను తీసుకువచ్చేందుకు దీన్ని ప్రయోగించారు. గ్రహశకలపు నమూనాలను సేకరించే అసలు లక్ష్యాన్ని అది ఎంత వరకు పూర్తి చేసిందన్నది తెలియరాలేదు. ఇది తెలుసుకోవడానికి కనీసం వారం రోజుల సమయం పడుతుందన్నారు శాస్త్రవేత్తలు. ఒకవేళ నమూనాల్ని సేకరించలేదని తేలితే మరోసారి ల్యాండ్ చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే అన్ని ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు.
గ్రహశకలం నుంచి నమూనాలను సేకరించడం అమెరికాకు ఇదే తొలిసారి కాగా... జపాన్ ఇప్పటికే రెండుసార్లు ఆ పని చేసింది.
రోబో చేయితో..
ఈ గ్రహశకలం పరిమాణం 1,670 అడుగులు మాత్రమే ఉంది. ఫలితంగా ఒసిరిస్‌రెక్స్ 11 అడుగుల రోబో చేయితో బెన్నును చేరుకొని.. రెండు ఔన్సుల రాయిని తీసుకొస్తుంది. రెండు సంవత్సరాలుగా బెన్ను కక్ష్యలో ఉన్న ఈ నౌక, పరిశోధనకు సరిపోయే పదార్థాలున్న ఓ ప్రాంతాన్ని కనుగొంది.
బెన్ను చుట్టూ ఒక నిర్దేశిత కక్ష్యలో పరిభ్రమించిన ఒసైరిస్.. నాలుగున్నర గంటలు శ్రమించి గ్రహశకలంపై ల్యాండ్ అయినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. గ్రహశకల ఉపరితలంపై అది 5-10 సెకన్లు మాత్రమే ఉంటుంది. పైగా వ్యోమనౌక మొత్తం కిందకు దిగకుండా కేవలం చేతిలాంటి ఒక పరికరం మాత్రమే గ్రహశకలాన్ని తాకుతుంది. అందుకే, ఈ ప్రక్రియను బెన్నును ముద్దాడడంగా శాస్త్రవేత్తలు అభివర్ణించారు. బెన్నుపై గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండడం వల్ల ల్యాండింగ్ ప్రక్రియ అతిక్లిష్టంగా కొనసాగినట్లు తెలిపారు. బెన్నును చేరడానికి నాసా దాదాపు దశాబ్ద కాలంగా కృషి చేస్తోంది. నేడు వారి కృషి ఫలించడంతో ఈ ప్రాజెక్టులో భాగమైన శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు అంతా ఆనందం వ్యక్తం చేశారు.