శిశువు జన్మించిన వెంటనే క్షయ నుంచి రక్షణకు ఇచ్చే బీసీజీ టీకా... కరోనాతో యుద్ధంలో మనదేశానికి కవచంగా మారిందా అనే ప్రశ్నకు... అవునంటూ అమెరికా శాస్త్రవేత్తలు సమాధానం ఇస్తున్నారు. అమెరికా, ఇటలీలోని తాజా పరిస్థితులపై న్యూయార్క్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్‌వైఐటీ) ఇటీవల పరిశోధన చేసింది. ఇంకా ప్రచురితమవని ఆ నివేదిక ప్రకారం... ఎన్నో ఏళ్లుగా బీసీజీని తప్పనిసరి చేసిన మనలాంటి దేశాలకంటే... అవసరమైతేనే ఈ టీకా వేయాలనే ఇటలీ, నెదర్లాండ్స్, అమెరికాలాంటి దేశాలే కరోనాతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారత్‌లో క్షయ మరణాలను అడ్డుకోవడానికి 1948 నుంచే బీసీజీ టీకాల కార్యక్రమం మొదలైంది. చిన్నపిల్లల్లో మెనింజైటిస్, క్షయ, శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లను తగ్గించడంలో ఇది సమర్థంగా పనిచేస్తుంది. సార్వత్రిక టీకాల కార్యక్రమంలో బీసీజీని అందరికంటే ముందు చేర్చిన దేశాల్లో కొవిడ్ మరణాల రేటు తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గమనించారు.
- ఇరాన్‌లో 1984 నుంచి బీసీజీ వేయడం ప్రారంభించగా అక్కడ ప్రతి 10 లక్షల మందికి మరణాల రేటు 19.7గా నమోదవుతోంది.
- 1947 నుంచే టీకా వేస్తున్న జపాన్‌లో మరణాల రేటు ప్రతి 10 లక్షల మందికి 0.28 ఉంది.
- ఇక 1920 నుంచే బీసీజీని నమ్ముకున్న బ్రెజిల్‌లో కొవిడ్ మృతులు ప్రతి 10 లక్షల మందికి 0.0573గా ఉండటం గమనార్హం.
ఆశాకిరణమే... కానీ జాగ్రత్తలు మానొద్దు
ప్రతి చిన్న విషయమూ ఒక ఆశాకిరణమే. కరోనా కుటుంబానికే చెందిన వైరస్ కారణంగా గతంలో వచ్చిన సార్స్‌ను బీసీజీ టీకా సమర్థంగానే అడ్డుకుంది. దీనితో కొవిడ్-19 తగ్గుతుందని కాదు. ప్రస్తుత సమాచారాన్ని చూస్తే రోగుల సంఖ్యను మాత్రం ఇది తగ్గిస్తుందని అనుకోవచ్చు.
-మోనిక గులాటీ, సీనియర్ డీన్, లౌలీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(పంజాబ్)
ఎన్‌వైఐటీ నివేదిక ఆసక్తికరంగా ఉంది. అయితే తుది నిర్ణయానికి రావడానికి సమగ్ర వివరాలు రావాల్సి ఉంది. అదే సమయంలో బీసీజీ టీకాకు కరోనాను నిరోధించే శక్తికి మధ్య సంబంధాన్ని కొట్టి పారేయలేం.
-రాకేష్‌మిశ్రా, డైరెక్టర్, సీసీఎంబీ(హైదరాబాద్)
ఇదీ చదవండి: సీబీఎస్ఈ విద్యార్థులకు పరీక్షలు లేకుండానే ప్రమోషన్