నాటో సభ్యదేశమైన టర్కీపై అమెరికా సర్కారు ఆంక్షలు విధించింది. రష్యా నుంచి ఎస్-400 గగనతల రక్షక వ్యవస్థను కొనుగోలు చేసినందుకు ఈ మేరకు చర్యలు తీసుకుంది.
రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేసినందుకు ఎఫ్-35 ఫైటర్ జెట్ల అభివృద్ధి, శిక్షణ కార్యక్రమాల నుంచి టర్కీని ఇదివరకే తప్పించింది అమెరికా. ఎస్-400 కొనుగోలు చేయడం అమెరికా భద్రతకు విఘాతం కలిగిస్తుందని చెబుతోంది.
"ఎస్-400 వ్యవస్థను కొనుగోలు చేయడం వల్ల రష్యా రక్షణ రంగానికి నిధులు అందడమే కాకుండా అమెరికా సైనిక సాంకేతికతను అపాయంలో పడేస్తుందని అత్యున్నత స్థాయి సమావేశాలలో టర్కీకి స్పష్టంగా వివరించాం. నాటో దేశాల వద్ద ఇదే తరహా వ్యవస్థలు అందుబాటులో ఉన్నప్పటికీ వీటి కొనుగోలుకు టర్కీ ముందుకెళ్లింది. అమెరికా సహకారంతో ఎస్-400 సమస్యను పరిష్కరించుకోవాలని టర్కీని కోరుతున్నా."
-మైక్ పాంపియో, అమెరికా విదేశాంగ మంత్రి
అయితే, టర్కీ తమకు అత్యంత విలువైన భాగస్వామిగా పేర్కొంది అమెరికా. ప్రాంతీయ భద్రత విషయంలో టర్కీ తమకు కీలకమని వెల్లడించింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న రక్షణ రంగ సహకారం మరింత ముందుకెళ్లాలనే ఆకాంక్షిస్తున్నట్లు తెలిపింది. ఎస్-400 వల్ల తలెత్తిన అడ్డంకులను తొలగించాలని టర్కీకి సూచించింది.