భారత్ నుంచి వచ్చే ప్రయాణికుల విమానాలపై పరిమితులు విధించాలని నిర్ణయించిన అమెరికా.. తాజాగా కొన్ని వర్గాలకు మినహాయింపునిచ్చింది. విద్యార్థులు, విద్యావేత్తలు, పాత్రికేయులు సహా కొవిడ్ సహాయ కార్యక్రమాల నిమిత్తం ప్రయాణిస్తున్న వారిపై ఎలాంటి పరిమితులు ఉండవని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రి టోనీ బ్లింకెన్ ప్రకటన విడుదల చేశారు.
మే 4 నుంచి భారత ప్రయాణికుల విమానాలపై పరిమితులు విధించనున్నట్లు శ్వేతసౌధం తొలుత ప్రకటించింది. భారత్‌లో వెలుగుచూస్తున్న కరోనా కేసుల్లో వైరల్ లోడ్ తీవ్రంగా ఉంటోందని, కొత్త రకాల వేరియంట్లు వెలుగు చూస్తున్నాయని ఆ దేశ ప్రజారోగ్య సంస్థ సీడీసీ చేసిన సూచన మేరకు శ్వేతసౌధం ఈ ప్రకటన జారీ చేసింది. కరోనా దృష్ట్యా బ్రెజిల్, చైనా, ఇరాన్, దక్షిణాప్రికాపైనా ఇదే తరహా ఆంక్షలు విధించినప్పటికీ.. కొన్ని వర్గాలకు మినహాయింపునిచ్చారు. అదే తరహాలో భారత్‌కు కూడా కొన్ని వర్గాలపై పరిమితులు ఎత్తివేయాలని ప్రతిపాదన వచ్చిన వెంటనే విదేశాంగ శాఖ అందుకు అంగీకరించింది.
పరిమితంగానే వీసాల జారీ..
వర్షాకాల ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు, విద్యావేత్తలు, జర్నలిస్టులు, వివిధ దేశాల్లో కరోనా కట్టడి కోసం కృషి చేస్తున్న వారి ప్రయాణాలపై ఎలాంటి పరిమితులు ఉండబోవని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అలాగే, కరోనా నేపథ్యంలో వివిధ దేశాల్లో ఉన్న రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లు పరిమిత సంఖ్యలో వీసాలు జారీ చేయనున్నాయని తెలిపింది. దీనిపై తాజా సమాచారాన్ని వెబ్‌సైట్లలో పొందుపరిచామని పేర్కొంది.
ఇప్పటికే ఎఫ్-1, ఎం-1 వీసాలు పొంది ఆగస్టు 1 నుంచి విద్యాసంస్థల్లో రిపోర్టు చేయాల్సిన వారు ప్రత్యేకంగా మళ్లీ కాన్సులేట్లకు వెళ్లి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. 30 రోజుల ముందు నుంచి వారు అమెరికాలోకి ప్రవేశించవచ్చని తెలిపింది. అయితే, ఎఫ్-1, ఎం-1 వీసా కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నవారు మాత్రం దగ్గర్లోని రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్‌ను సంప్రదించాలని కోరింది.