Pig Human Transplant: వైద్యరంగంలోనూ అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో జంతువుల అవయవాలు మనుషులకు మార్పిడి చేయడంలో పరిశోధకులు విజయాలు సాధిస్తున్నారు. ఇటీవల అమెరికాలో పంది గుండెను మనిషికి మార్పిడి చేసిన వైద్యులు మరో అడుగు వేశారు. అలబామా విశ్వవిద్యాలయానికి చెందిన వైద్యులు జన్యు మార్పిడి చేసిన ఓ పంది నుంచి సేకరించిన మూత్రపిండాలను జీవన్మృతుడికి(బ్రెయిన్ డెడ్ పేషెంట్‌కు) అమర్చారు. అనంతరం 3 రోజులపాటు వాటి పనితీరును పరిశీలించారు. జీవన్మృతుడి శరీరం పంది మూత్రపిండాలను తిరస్కరిస్తున్న సంకేతాలేవీ కనిపించలేదని అలబామా విశ్వవిద్యాలయ వైద్యులు తెలిపారు.
Pig Kidneys to Brain Dead Man: అవయవ మార్పిడి తర్వాత ఆ వ్యక్తిని ప్రాణాధార వ్యవస్థపై ఉంచిన 3 రోజులు సక్రమంగా పని చేసినట్లు వెల్లడించారు. ఒకదాని తర్వాత ఒకటి క్రమపద్ధతిలో రిహార్సల్ చేపట్టి కిడ్నీ మార్పిడి చేసినట్లు తెలిపారు. పందికి ఉన్న ఎలాంటి వైరస్ ఆయనకు సోకలేదని, రక్తంలో పంది కణాలు కూడా ఏవీ కనిపించలేదని డాక్టర్లు వెల్లడించారు.
''అచ్చంగా మనుషుల అవయవాలు అమర్చినట్లు ఆరంభం నుంచి ముగింపు వరకు క్రమపద్ధతిలో చర్యలు చేపట్టాం. మనుషుల అవయవ మార్పిడిలో అనుసరించిన పద్ధతిని క్రమపద్ధతిలో అనుసరించాలని భావించాం. సురక్షితంగా ప్రక్రియను చేపట్టాలని అనుకున్నాం. అదే తరహాలో ఈ ప్రయోగాన్ని చేశాం.''
- జేమీ లాకీ, అలబామా విశ్వవిద్యాలయ వైద్యురాలు
ప్రపంచవ్యాప్తంగా అవయవాలకు కొరత ఏర్పడిన నేపథ్యంలో తాజా ప్రయత్నం ఆ సమస్యను తీర్చనుందని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇవీ చూడండి: మెడికల్ మిరాకిల్.. మనిషికి పంది గుండె అమర్చిన వైద్యులు