అమెరికాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. డెల్టా వేరియెంట్ ధాటికి కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఓవైపు టీకాల పంపిణీ శరవేగంగా సాగుతున్నప్పటికీ వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఫలితంగా ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో మళ్లీ కఠిన ఆంక్షలు విధిస్తోంది అగ్రరాజ్యం. సోమవారం ఒక్కరోజే 56,369 మంది కొవిడ్ బారిన పడగా.. మరో 213 మంది ప్రాణాలు కోల్పోయారు.
నెలరోజులు ఆలస్యంగా..
అమెరికాలో 70 శాతం మందికి కరోనా టీకా తొలిడోసు అందించినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. అయితే అధ్యక్షుడు జో బైడెన్.. నిర్దేశించిన లక్ష్యానికి నెల రోజులు ఆలస్యమైనట్లు అధికారులు తెలిపారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మాస్కు ధరించే నిబంధనలు సహా టీకాలు తీసుకోవడం తప్పనిసరి చేసేపనిలో పడింది బైడెన్ సర్కార్. బహిరంగ ప్రదేశాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా మాస్క్ ధరించేలా చర్యలు తీసుకుంటోంది.
గడిచిన రెండు వారాల్లో ఫ్లోరిడా రాష్ట్రంలో కరోనాతో ఆస్పత్రిలో చేరినవారి సంఖ్య 140 శాతానికి చేరినట్లు అక్కడి అధికారులు తెలిపారు.
మాస్క్ ఉండాల్సిందే..
డెల్టా వేరియంట్ విజృంభణ నేపథ్యంలో శాన్ ఫ్రాన్సిస్కో మాస్క్ అధికారులు మాస్క్‌ను తప్పనిసరి చేశారు. ఈ మేరకు ఆరు నగరాల్లో ఆదేశాలు జారీ చేశారు.ఇంట్లో ఉన్నా మాస్క్‌ధరించాలని ఉత్తర్వులు ఇచ్చారు. శాన్ ప్రాన్సిస్కో, శాంట క్లారా, సొనోమా, మారిన్, కాంట్రా కోస్తా, అల్మేదా నగారాల్లో కఠిన ఆంక్షలు విధించింది.
న్యూయార్క్‌లోనూ కొవిడ్ బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో మాస్కు ధరించడాన్ని ప్రోత్సహిస్తున్నారు అక్కడి అధికారులు. అలాగే వ్యాక్సిన్ తీసుకోని ఉద్యోగులు ప్రతివారం కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు ఆ రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ కౌమో.
మరోవైపు వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ఇంట్లో ఉన్నా మాస్క్ ధరించాలని ప్రజలను కోరారు న్యూయార్క్ సిటీ మేయర్ బిల్ డే బ్లాసియో
పెరిగిన విమాన ప్రయాణికులు..
అమెరికాలో ఓ వైపు కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నప్పటికీ విమాన ప్రయాణాలు మాత్రం తగ్గడం లేదు. విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం ఒక్కరోజే 22 లక్షల మంది విమానాల్లో ప్రయాణించినట్లు పేర్కొన్నారు. కరోనా సంక్షోభంలో ఇదే అత్యధికమని తెలిపారు.
వారి కోసం విధానాలు..
డెల్టా వ్యాప్తి నేపథ్యంలో రానున్న రెంటల్స్ భయపడుతున్నారు. రెండు నెలల్లో తమను ఇళ్లనుంచి బయటకు పంపించే అవకాశాలున్నాయని.. 14 లక్షల కుటుంబాలు.. సెన్సస్ బ్యూరోకి తెలిపాయి. అయితే దీనిపై చర్యలు తీసుకోలేమని చెప్పిన బైడెన్ సర్కారు.. రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలు ఇందుకు సమర్థమైన చర్యలు తీసుకోవాలని కోరింది.
రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలు అద్దెదారులను యజమానులు తమ ఇళ్లలోనే ఉంచేలా పాలసీలను తీసుకురావాలని బైడెన్ సర్కారు సూచించింది.
ఇరాన్లో భారీగా కేసులు..
ఇరాన్‌లోనూ కొవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే అత్యధికంగా 37వేల మందికి పైగా వైరస్ బారిన పడినట్లు స్థానిక మీడియా పేర్కొంది. మంగళవారం 34 వేల మందికిపైగా కొవిడ్ పాజిటివ్‌గా తేలిందని తెలిపింది. మరో 411 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 91 వేలు దాటింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
ఇదీ చూడండి: వ్యాక్సినేషన్ పూర్తైందా? బూస్టర్ డోసుకు సిద్ధమా?