భారతీయులతో సహా పలు దేశాలకు చెందిన నిపుణులు, ఉద్యోగుల్లో డిమాండు ఉన్న హెచ్1బీ వీసా దరఖాస్తు ప్రక్రియ ముగిసినట్టు అమెరికా ప్రకటించింది. 2021 సంవత్సరానికి గాను నిర్ణీత పరిమితికి సరిపడా దరఖాస్తులు స్వీకరించినట్టు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) వెల్లడించింది.
పూర్తైన గడువు..
అమెరికాలో ఉద్యోగాలను చేపట్టేందుకు వీలు కలిగించే హెచ్1బీ సాధారణ వీసా విభాగంలో గరిష్ట పరిమితి 65 వేలు. అత్యున్నత విద్యార్హతలు, నైపుణ్యం గలవారికి ఉద్దేశించిన ప్రత్యేక వీసా విభాగంలో 20 వేల దరఖాస్తులు స్వీకరించామని యూఎస్‌సీఐఎస్ తెలిపింది. దీనితో దరఖాస్తుల పర్వం పూర్తైందని ప్రకటించింది. దరఖాస్తుదారులలో అర్హులైన వారిని కంప్యూటర్ లాటరీ ద్వారా ఎంపిక చేస్తామని ఇమ్మిగ్రేషన్ అధికారులు వెల్లడించారు. తిరస్కరించబడిన దరఖాస్తుల సమాచారాన్ని సంబంధిత అభ్యర్ధులకు ఇప్పటికే తెలియచేశామని వివరించారు.
ఇదీ చదవండి: 'అమెరికాకు భారత్ కీలక రక్షణ భాగస్వామి'