అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమిగ్రేషన్ వ్యవస్థకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. మెరిట్ ఆధారిత ఇమిగ్రేషన్ వ్యవస్థను అమల్లోకి తీసుకొస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఈ మేరకు శ్వేతసౌధం ప్రకటన విడుదల చేసింది.
వలస విధానాల్లో మార్పులకు సంబంధించి ఓ టీవీ ముఖాముఖిలో కీలక వ్యాఖ్యలు చేశారు ట్రంప్. అనంతరమే ఈ ఆదేశాలు వెలువడ్డాయి. చిన్నవయస్సులోనే అమెరికాకు వెళ్లేవారికి సంబంధించి కూడా ఈ ఆదేశాల్లో ఉటంకించారు ట్రంప్. చిన్నవయస్సు వలసదారుల కోసం ఉద్దేశించిన డిఫర్ర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్ హుడ్ అరైవల్స్(డీఏసీఏ) వలస చట్టంలో కీలక మార్పని చెప్పారు ట్రంప్. ఇది భవిష్యత్తులో పౌరసత్వాన్ని పొందేందుకు మార్గంగా పనిచేస్తుందని వెల్లడించింది.
"ఇది చాలా పెద్ద బిల్లు అవుతుంది. ఈ మెరిట్ ఆధారిత బిల్లులోనే చిన్న వయస్సులో వలసవచ్చే వారికి కల్పించే సదుపాయాల నిబంధనలకు (డిఫర్ర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్- డీఏసీఏ) సవరణలు ఉంటాయి. దీనిపై ప్రజలంతా సంతోషంగా ఉంటారు. డీఏసీఏ ద్వారా చిన్నవయస్సులో వలసవచ్చినవారు పౌరసత్వాన్ని పొందేందుకు మార్గం సుగమమవుతుంది."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
అమెరికా పౌరులకు భవిష్యత్తులో ఉపాధి కల్పనలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే మెరిట్ ఆధారిత వలస విధానాన్ని తెచ్చేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని ప్రకటించింది శ్వేతసౌధం. ఈ ప్రతిపాదిత చట్టంలోనే సరిహద్దు భద్రత, శాశ్వత మెరిట్ ఆధారిత వ్యవస్థను తెచ్చేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని వెల్లడించింది.
బిల్లును తయారుచేసేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను జారీ చేస్తారు. సంబంధిత అధికారులు బిల్లును రూపొందించిన అనంతరం దానిని చట్టసభల్లో ప్రవేశపెడతారు. సభ్యుల నిర్ణయంపై బిల్లు భవితవ్యం ఆధారపడి ఉంటుంది.
ఇదీ చూడండి: 'చైనాతో వాణిజ్య ఒప్పందం ఇప్పట్లో లేనట్టే'