అమెరికాలోని ఆసియా పార్లర్లను లక్ష్యంగా చేసుకొని కాల్పులకు పాల్పడిన శ్వేతజాతీయుడు రాబర్ట్ ఆరోన్ లాంగ్(21)పై పోలీసులు అభియోగాలు మోపారు. ఎనిమిది మందిని చంపినందుకు అతనిపై కేసు నమోదు చేశారు. విచక్షణా రహితంగా దాడి చేయడానికి గల కారణాలను అన్వేషించే పనిలో నిమగ్నమయ్యారు. ఇందుకు ఆ యువకుడిని ప్రేరేపించిన అంశం ఏంటన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.
జాతిపరమైన వివక్షతో ఈ కాల్పులు చేయలేదని నిందితుడు పోలీసులతో చెప్పినట్లు తెలుస్తోంది. అతడికి లైంగిక వ్యసనాలు(సెక్స్ అడిక్షన్) ఉన్నాయని, నిందితుడికి ఉద్రేకం కలిగించే దృశ్యాలు కనిపించినప్పుడు ఈ విధంగా ప్రవర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. ఫ్లోరిడాలో ఉన్న ఓ పోర్న్ ఇండస్ట్రీపై దాడి చేసేందుకు నిందితుడు వెళ్తున్నట్లు గుర్తించామని చెప్పారు. కాల్పులు జరిగిన ఈ ప్రాంతానికి రాబర్ట్ ఇదివరకు వెళ్లాడో లేదో తెలీదని చెప్పారు.
"అతనికి ఏదో సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. లైంగిక వ్యసనాలు ఉన్నాయని అతడు భావిస్తున్నాడు. అతని ఉద్రేకాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నించాడని తెలుస్తోంది. తనకు ఉన్న వ్యసనాలు అతడిని ఇక్కడికి వెళ్లేలా చేసి ఉండొచ్చు."
-కెప్టెన్ జే బేకర్, చెరోకీ కౌంటీ షెరిఫ్
అయితే, పోలీసుల ప్రకటనపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతం, మృతుల నేపథ్యం అనుమానం కలిగించేవిగా ఉన్నాయని చెబుతున్నారు. జెనోఫోబియా(విదేశీయుల పట్ల భయం), మహిళల పట్ల ద్వేషంతోనే కాల్పులు జరిగి ఉంటాయని రిపబ్లికన్ నేత బీ ఎంగుయెన్ ఆరోపించారు.
మంగళవారం సాయంత్రం.. అట్లాంటా రాష్ట్రంలోని ఆసియా మసాజ్ పార్లర్లే లక్ష్యంగా నిందితుడు అరోన్ కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. మృతుల్లో చాలా మంది ఆ మసాజ్ కేంద్రాల్లో పనిచేస్తున్న ఆసియా సంతతి మహిళలే ఉన్నారు.
ఇదీ చదవండి: మూడు మసాజ్ సెంటర్లలో కాల్పులు-8 మంది మృతి