అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రం నిరసనలతో హోరెత్తింది. పోర్ట్‌ల్యాండ్‌లో జరుగుతున్న ఆందోళనల్లో భాగంగా కాల్పుల కలకలం రేగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించడం వల్ల.. నిరసనలు మరింత హింసాత్మకంగా మారాయి. అయితేే మృతుడు ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
ఫెడరల్ అధికారులు.. ఎలాంటి బ్యాడ్జ్‌లు, నేమ్ ట్యాగ్లు లేకుండానే ఆందోళనకారుల్ని చట్ట విరుద్ధంగా అదుపులోకి తీసుకుంటున్నారనే కారణంతో పోర్ట్‌ల్యాండ్‌లో ఘర్షణ నెలకొంది.
ఈ ఘటనను డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ తీవ్రంగా ఖండించారు. అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇదే విధంగా చేయాలని ట్విట్టర్ వేదికగా సవాల్ విసిరారు.
'పోర్ట్‌ల్యాండ్ హింసాత్మక ఘటన ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. అమెరికా లాంటి గొప్ప దేశంలోని నగర వీధుల్లో ఇలా కాల్పులు జరగడం దురదృష్టకరం. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ట్రంప్ కూడా అలాగే చేయాలని సవాల్ చేస్తున్నా.'
- జో బైడెన్, డెమొక్రటిక్ పార్టీ
దీనిపై స్పందించిన ట్రంప్.. ఈ ఘటనకు పోర్ట్‌ల్యాండ్ డెమొక్రట్ మేయర్ టెడ్ వీలర్ కారణమని ఆరోపించారు.
'దేశంలో అందరిలాగే పోర్ట్‌ల్యాండ్ ప్రజలూ శాంతిభద్రతలను కోరుతున్నారు. కానీ ప్రస్తుతం అక్కడున్న రాడికల్ డెమొక్రట్ మేయర్ మాత్రం ఈ ఘటనపై ఇప్పటివరకూ స్పందించ లేదు. భవిష్యత్తులోనూ ఇలాగే ఉంటారు.'
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.
టెడ్ వీలర్ పదవి కాలంలో అనేకసార్లు తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయన్న ట్రంప్.. ఇలాంటి విధ్వంసాలే ఆయన కోరుకుంటారని ఆరోపించారు. వీలర్ లాంటి వ్యక్తులు మేయర్‌గా ఉన్నంతకాలం పోర్ట్‌ల్యాండ్ పరిస్థితులు ఇలాగే ఉంటాయని చెప్పుకొచ్చారు ట్రంప్.
ఇదీ చదవండి: ఫిలిప్పీన్స్‌లో రైతులపై కాల్పులు- 9 మంది మృతి