ప్రపంచ దేశాలను మించి అమెరికాలో కరోనా అంతకంతకూ వ్యాపిస్తోంది. ఇప్పటికే 2.1 లక్షల మందికి వైరస్ సోకగా.. 5 వేల మంది మృత్యువాత పడ్డారు. ఈ సమయంలో వైద్య పరికరాల నిల్వలు నిండుకుంటున్నాయన్న వార్తలు అగ్రరాజ్యాన్ని కలవరపెడుతున్నాయి.
కరోనా నేపథ్యంలో అమెరికా అత్యవసర పరిస్థితి నియంత్రణ సంస్థ (ఫెమా) 1.16 కోట్ల ఎన్-95 మాస్కులు, 52 లక్షల ఫేస్ మాస్కులు, 2.2 కోట్ల చేతి తొడుగులు, 7,140 వెంటిలేటర్లు అందించింది.
నిండుకున్న నిల్వలు..
ఫలితంగా అత్యవసర వైద్య సామగ్రి నిల్వలు దాదాపు పూర్తిగా అయిపోయినట్లు అమెరికా అధికారి ఒకరు వెల్లడించారు. వైద్య సిబ్బంది కోసం ఉద్దేశించిన వ్యక్తిగత సంరక్షణ పరికరాలు (పీపీఈ).. మాస్కులు, సూట్లు, గ్లవ్స్ కొద్దిమేర ఉన్నట్లు తెలిపారు.
ఈ పరిస్థితుల్లో ట్రంప్ సర్కారు అప్రమత్తమైంది. పీపీఈలు, మాస్కులతోపాటు వెంటిలేటర్ల తయారీని వేగవంతం చేయాలని ప్రైవేటు సంస్థలను కోరింది.
"దేశంలోని వైద్యులు, నర్సులు, ఆరోగ్య సంరక్షణ కార్మికులకు కీలకమైన వైద్య సామగ్రి తయారీ, సరఫరా కోసం మా ప్రభుత్వం కృషి చేస్తోంది. తయారీ రంగం, సరఫరా గొలుసులు, ఆవిష్కరణలకు సంబంధించిన పరిశ్రమల ఉత్పాదక శక్తిని పెంచుతోంది."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
ఇప్పటికే హేన్స్ సంస్థ మాస్కులను భారీగా ఉత్పత్తి చేస్తోందని ట్రంప్ తెలిపారు. ఒహాయో రాష్ట్రంలోని హృద్రోగ ఆరోగ్య శాఖ 22 లక్షల గౌన్లు దేశానికి అందించిందని స్పష్టం చేశారు. 11 కంపెనీల సహకారంతో వేలాది వెంటిలేటర్ల తయారీ జరుగుతోందన్నారు.
రష్యా సాయం..
ఇప్పటికే పీపీఈలకు సంబంధించి ఎగుమతులను అమెరికా ప్రభుత్వం నిషేధించింది. మరోవైపు అమెరికాకు వైద్య పరికరాలకు సంబంధించి రష్యా సాయానికి ముందుకొచ్చింది. వెంటిలేటర్లు, మాస్కులు, సంరక్షణ కిట్లను 60 టన్నుల మేర పంపించింది.
ఇదీ చూడండి: 'మాకు రక్షణేది?'... అమెరికా నర్సుల నిరసన బాట