కరోనా వైరస్ ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2లక్షల మందికి ఈ వైరస్ సోకింది. 7వేల900 మంది ప్రాణాలను బలిగొన్న కరోనా వైరస్ కారణంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ప్రపంచ స్టాక్ మార్కెట్లు చరిత్రలో లేని విధంగా పతనమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాను ఎదుర్కొనేందుకు బిలియన్ డాలర్లను ఉద్దీపన ప్యాకేజీగా ప్రకటించనున్నట్లు చెప్పారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నష్టాల్లో ఉన్న వ్యాపార రంగాలకు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. బ్రిటన్ కూడా బిలియన్ డాలర్ల ప్యాకేజీతో కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. కరోనా సంక్షోభం ముంచుకొస్తున్నా.. సరైన చర్యలు చేపట్టడం లేదని ఈ రెండు దేశాలపై గతంలో విమర్శలు వెల్లువెత్తాయి.
అగ్రదేశాలు చేపట్టబోయే ఆర్థిక చర్యలు
- కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రవేశపెట్టబోయే బిల్లు కోసం కాంగ్రెస్‌తో చర్చిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు.
- దాదాపు 850 బిలియన్ డాలర్లను ఆర్థిక సాయంగా ప్రకటించనున్నారని సమాచారం.
- తీవ్ర సంక్షోభంలో ఉన్న విమానయాన రంగానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
- బ్రిటన్ కూడా భారీ ఉద్దీపన ప్యాకేజీతో సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశ ఆర్థిక మంత్రి తెలిపారు.
- నష్టాల్లో ఉన్న వ్యాపార సంస్థలను ఆదుకునేందుకు 400బిలయన్ డాలర్ల ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు.
- ఫ్రాన్స్ కూడా 50 బిలియన్ డాలర్లను ఉద్దీపన ప్యాకేజీగా ప్రకటిస్తామని తెలిపింది.
కొనసాగుతున్న ఆంక్షలు
కరోనాను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు.. చేపట్టిన ముందు జాగ్రత్తలను యథావిధిగా కొనసాగిస్తున్నాయి.
- ఐరోపా దేశాల సరిహద్దులను నెల రోజుల పాటు మూసివేశారు.
- బెల్జియంను ఏప్రిల్ 5వరకు మూసివేయనున్నారు.
- అమెరికా, బ్రిటన్‌లో ఆంక్షలు కొనసాగుతున్నాయి.
- అగ్రరాజ్యంలోని మేరీల్యాండ్‌లో ప్రాథమిక ఎన్నికలు వాయిదా పడ్డాయి.
- ప్రజలు విదేశీ ప్రయాణాలు రద్దు చేసుకోవాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం సూచించింది.
- 100 మందికిపైగా గుమిగూడకుండా ఆంక్షలు విధించింది.
- జర్మనీలో చర్చ్‌లు, మసీదులలో ప్రార్థనలు నిషేధించారు.
కరోనా కారణంగా క్రీడారంగంలో ప్రఖ్యాత టోర్నీలను వాయిదా వేశారు.
- యూరోపియన్ ఫుట్‌బాల్ ఛాంపియన్షిప్ వచ్చే ఏడాదికి వాయిదా పడింది.
- ప్రెంచ్ ఓపెన్ సెప్టెంబర్‌కు వాయిదా పడింది.
- టోక్యో ఒలింపిక్స్ యథావిధిగా జరుగుతాయని జపాన్ ప్రధాని తెలిపినా.. వాయిదా పడే అవకాశాలు ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ.
వ్యాక్సిన్ కోసం అహర్నిశలు..
కరోనా వ్యాక్సిన్‌ను వీలైనంత త్వరగా కనుగొనేందుకు ప్రపంచంలోని ప్రఖ్యాత ఔషధ తయారీ సంస్థలన్నీ అహర్నిశలు శ్రమిస్తున్నాయి. అయితే ఎంత లేదన్నా కనీసం ఏడాది సమయం పడుతుందని స్పష్టం చేస్తున్నాయి.
కరోనా వ్యాక్సిన్‌ను మనుషులపై ప్రయోగించింది అమెరికా. ప్రయోగ ఫలితాలు తెలియాల్సి ఉంది.