కరోనా సమయంలో హ్యాకింగ్ ద్వారా అమెరికన్ల వైద్య సమాచారాన్ని తస్కరించడం చైనా ముమ్మరం చేసిందని యూఎస్ నేషనల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ సెంటర్(ఎన్సీఎస్సీ) వెల్లడించింది. గత కొన్నేళ్ల నుంచి అమెరికా సహా ప్రపంచ దేశాల నుంచి వైద్య సమాచారాన్ని చైనా భారీ స్థాయిలో సేకరిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.
కరోనా సమయంలో ఈ సమాచార సేకరణ మరింత వేగం పుంజుకుందని తెలిపింది ఎన్సీఎస్సీ. ముఖ్యంగా డీఎన్ఏ వివరాలను తస్కరిస్తోందని వెల్లడించింది. బీజీఐ అనే చైనా బయోటెక్నాలజీ సంస్థ చాలా దేశాల్లో కొవిడ్ టెస్టు కిట్లను విక్రయించిందని.. గత ఆరు నెలల్లోనే 18 టెస్టింగ్ ల్యాబ్‌లను నెలకొల్పిందని వివరించింది. ఇదంతా.. వైద్య సమాచారాన్ని సేకరించడం కోసమేనని ఆరోపించింది.
వాణిజ్య ప్రయోజనాల కోసం
అమెరికా బయోటెక్నాలజీ రంగాన్ని తలదన్ని పైకి ఎదిగేందుకు ఈ సమాచారాన్ని చైనా ప్రభుత్వం ఉపయోగిస్తోందని ఎన్సీఎస్సీ హెచ్చరించింది. పరిశోధనల సమాచారాన్ని హ్యాకర్లు లక్ష్యంగా చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా ఉద్యోగ మార్కెట్‌పైనా ఈ ప్రభావం ఉందని పేర్కొంది.
"వైద్య సమాచారాన్ని కొల్లగొట్టడం వల్ల అమెరికన్ల గోప్యతకు భంగం వాటిల్లడమే కాకుండా.. ఆర్థిక వ్యవస్థకు, దేశ భద్రతకు విఘాతం కలుగుతుంది. జనాభా వైవిధ్యంగా ఉండటం, వ్యక్తిగత సమాచార భద్రత పటిష్ఠంగా లేకపోవడం వల్లే అమెరికా ప్రజలను చైనా లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ సమాచారంతో వాణిజ్యపరంగా ఎక్కువ విలువ ఉన్న ఆవిష్కరణలు చేయాలని చైనా భావిస్తోంది."
- ఎన్సీఎస్సీ
అమెరికా వైద్య రంగానికి చైనా నుంచి ఉన్న ముప్పుపై ఎన్సీఎస్సీ మాజీ డైరెక్టర్ విలియం ఎవానినా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హెచ్చరించిన తర్వాతి రోజే ఈ ప్రకటన రావడం గమనార్హం. గత ఐదేళ్లలో ఐదారు ఆరోగ్య సంరక్షణ కంపెనీలపై చైనా హ్యాకింగ్‌కు పాల్పడిందని ఎవానినా పేర్కొన్నారు. 'ప్రస్తుత అంచనాల ప్రకారం 80 శాతం అమెరికన్ యువకుల వ్యక్తిగత గుర్తింపు సమాచారం చైనా కమ్యునిస్టు పార్టీ తస్కరించింది' అని చెప్పారు.
ఇదీ చదవండి: '18వేలకుపైగా అమెరికా సంస్థలపై సైబర్ దాడి'