అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీ కాలం ముగియడానికి ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. అయితే గురువారం క్యాపిటల్ భవనంలో హింసాత్మక ఘటనలు జరిగిన నేపథ్యంలో ట్రంప్‌ను పదవి నుంచి తొలగించే విషయమై ఇరు పార్టీల చట్టసభ్యులు విస్తృతంగా చర్చించారు. ఆయన్ను తొలగించకపోతే సభ రెండో అభిశంసన తీర్మానం ప్రవేశపెడుతుందని స్పీకర్ నాన్సీ పెలోసి వ్యాఖ్యానించారు. దీనిపై ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, ఇతర కేబినెట్ అధికారుల నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు స్పీకర్ పేర్కొన్నారు.
రాజ్యాంగంలోని 25వ సవరణను అమలు చేసి.. తక్షణమే ట్రంప్‌ను తొలగించాలని పెన్స్‌ను కోరారు కాంగ్రెస్‌లోని డెమొక్రటిక్ పార్టీ నేతలు. (25వ సవరణ ప్రకారం.. కేబినేట్లో మెజారిటీ సభ్యులు కోరిక మేరకు అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించే అధికారం ఉపాధ్యక్షుడికి ఉంటుంది). ప్రమాదకరమైన దేశద్రోహ చర్యలకు పాల్పడుతున్న ఆరోపణతో ట్రంప్‌ను కార్యాలయం నుంచి బయటకు పంపించాలని వారు కోరారు.
'ట్రంప్ తప్పు అంగీకరించాలి'
క్యాపిటల్ భవనం వద్ద జరిగిన హింసాత్మక ఘటనలో తన పాత్ర ఉన్నట్లు ట్రంప్ ఒప్పుకోవాలన్నారు రిపబ్లికన్ పార్టీ సెనెటర్ లిండెసే గ్రహం. ట్రంప్‌కు సహాయంగా ఉన్నందుకు బాధపడట్లేదు. కానీ ట్రంప్‌ది స్వయంకృత అపరాదమేనని ఆయన వ్యాఖ్యానించారు.
కేబినెట్ సభ్యుల రాజీనామా
క్యాపిటల్ ఘటనకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి బెస్టీ దేవోస్, రవాణా మంత్రి ఎలైన్ ఛావోలు తమ పదవులకు రాజీనామా చేశారు.
క్యాపిటల్ పోలీసు చీఫ్ స్టీవెన్ సుండ్ కూడా ఈ నెలలో రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. భవనంలోకి ప్రవేశించిన ట్రంప్ మద్దతుదారులను అడ్డుకోవడంలో విఫలమవడంపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయిం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
ఇదీ చూడండి: అమెరికాలో హింసపై ప్రపంచదేశాల ఆందోళన