భారత్-అమెరికా దేశాల్లో ఆదర్శవంతులైన గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అనుసరించిన విధానాలను మరింత ముందుకు తీసుకుపోయే చట్టానికి ఆ దేశ ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. దీంతో వారిరువురూ పాటించిన విలువలపై మరింత లోతుగా అధ్యయనం జరగనుంది. ఇందుకుగానూ భారత విదేశాంగ శాఖ సహకారం అందించనుంది.
జాతి స్వాతంత్ర్యం కోసం ఇరువురు చేసిన పోరాటంలో వారు ఎంచుకొన్న విధానాలే ప్రధాన లక్ష్యంగా పరిశోధన జరగనుంది. ఇందులో ముఖ్యంగా అహింసను ఆధారం చేసుకొని వారు ముందుకు నడిచిన విధానాన్ని ప్రజానీకానికి తెలియజేయనున్నారు.
"ఈ చట్టం అమెరికా, భారతదేశ ప్రజల మధ్య ఉన్న దీర్ఘకాల సంబంధాన్ని గౌరవిస్తుంది. గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చేసిన బోధనలను ముందుకు తీసుకువెళ్తుంది. అంతేగాక వాతావరణ మార్పు, విద్యా, ప్రజారోగ్యం వంటి సమస్యలను పరిష్కరించడానికి ఇరు దేశాలు కలిసి పనిచేసేందుకు వీలుంటుంది."
- ఎలియట్ ఎంగెల్, హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్
ఇందుకుగాను 2022-2025 మధ్య కాలానికి 15 మిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నారు.