చైనా సహా ఇతర దేశాలు మతస్వేచ్ఛను అణచివేస్తున్నాయని అమెరికా ఆందోళన వ్యక్తంచేసింది. వార్షిక అంతర్జాతీయ మతస్వేచ్ఛ నివేదిక విడుదల చేసిన అగ్రరాజ్యం.. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల ఉల్లంఘనపై విశ్లేషణ చేపట్టింది. ప్రార్థనా స్వేచ్ఛకూ తమ పౌరులను దూరంగా ఉంచుతోందని చైనాపై మండిపడింది.
"మతపరమైన భావ ప్రకటనను చైనా నేరపూరితంగా పరిగణిస్తోంది. ముస్లిం ఉయ్గుర్లపై మారణహోమాన్ని కొనసాగిస్తోంది. ఇతర మతపరమైన మైనారిటీలపైనా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోంది."
-అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్
క్రైస్తవులు, ముస్లింలు, టిబెట్ బౌద్ధులతో పాటు ఫాలున్ గోంగ్ మతాన్ని ఆచరించే వారికి చైనాలో వివక్ష ఎదురవుతోందని నివేదిక పేర్కొంది. ఉద్యోగం, నివాసం, వ్యాపార అవకాశాల్లో వారికి సముచిత ప్రాధాన్యం దక్కడం లేదని తెలిపింది.
ఇదీ చదవండి: 'భారత్లో మైనారిటీలపై వివక్ష, హింస'
ఇరాన్, మయన్మార్, రష్యాలో మత స్వేచ్ఛపైనా నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. నైజీరియా, సౌదీ అరేబియాలో పరిస్థితులు మతపరమైన మైనారిటీలకు యోగ్యంగా లేవని పేర్కొంది. ఈ దేశాలన్నింటినీ అపరాధులుగా అభివర్ణించింది.
అంతర్జాతీయ సమాజం సైతం..
మరోవైపు, అమెరికా నేతృత్వంలో సమావేశమైన మానవ హక్కుల సంఘాలు, ఐరోపా దేశాలు.. చైనాలో మానవ హక్కుల ఉల్లంఘనపై తీవ్ర స్థాయిలో ఆక్షేపణ వ్యక్తం చేశాయి. ఉయ్గుర్ మైనారిటీలపై నేరాలకు పాల్పడుతోందని చైనాపై ఆరోపణలు గుప్పించాయి. ఐరాస నిపుణులకు ఆ ప్రాంతాన్ని సందర్శించే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశాయి. వర్చువల్గా జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశాయి.
ఖండించిన చైనా..
అయితే, ఈ ఆరోపణలను చైనా ఖండించింది. ఇవన్నీ రాజకీయ ప్రేరేపిత కల్పితాలని పేర్కొంది. ఈ సమావేశానికి హాజరు కాకూడదని ఐరాసలోని 193 సభ్యదేశాలకు వారం క్రితమే చైనా లేఖలు రాసింది. ఈ అంశానికి 15 పశ్చిమ దేశాలు మద్దతు ఇవ్వడం ఆశ్చర్యకరమని పేర్కొంది. మద్దతు ఉపసంహరించుకోకపోతే.. తమ దేశంతో సంబంధాలపై ప్రమాదకరమైన ప్రభావం పడుతుందని హెచ్చరించింది.
నిర్బంధంలో 10 లక్షల మంది
షింజియాంగ్లోని మైనారిటీలపై చైనా మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని అంతర్జాతీయ సమాజం ఎప్పటినుంచో చెబుతోంది. పలు దేశాల నివేదికల ప్రకారం ఈ ప్రాంతంలోని 10 లక్షలకు పైగా ప్రజలను క్యాంపులలో నిర్బంధించింది. వీరితో వెట్టి చాకిరీ చేయిస్తోందని అధికారులు ఆరోపిస్తున్నారు. హింసకు గురిచేసి.. జననాలను నియంత్రిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే వీటిని ఖండించిన చైనా సర్కారు.. నైపుణ్య శిక్షణా కార్యక్రమాల కోసమే ఈ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వీటిని మూసేసినట్లు తెలిపింది.
ఇదీ చదవండి: 500 రాకెట్లను తట్టుకొన్న ఉక్కుగొడుగు అది..!