US helicopter crash: అగ్రరాజ్యంలోని హవాయి ద్వీపంలో ఓ కాంట్రాక్టర్ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లోని మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా నౌకాదళం వెల్లడించింది.
బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో గాల్లోకి ఎగిరిన కాసేపటికే కూలిపోయినట్లు హవాయి ద్వీపాల్లోని కౌవా ప్రాంతంలో ఉన్న నేవీ బేస్.. పసిఫిక్ మిసైల్ రేంజ్ ఫెసిలిటీ వెల్లడించింది. హెలికాప్టర్లో ఉన్న వారిలో ఏ ఒక్కరు ప్రాణాలతో బయటపడలేదని, వారి వివరాలు ఇంకా తెలియరాలేదని స్పష్టం చేసింది. ఈ చాపర్‌ను క్రోమన్ కార్పొరేషన్ అనే సంస్థ నిర్వహిస్తోందని పేర్కొంది. సిబ్బంది శిక్షణ కోసం గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే ప్రమాదం జరిగినట్లు నేవీ బేస్ తెలిపింది.
ఈ హెలికాప్టర్ సికొర్స్కీ ఎస్-16ఎన్ మోడల్‌గా అమెరికా జాతీయ రవాణా భద్రత విభాగం ట్విట్టర్లో పేర్కొంది. ఈ మోడల్ చాపర్లు 1959-1980 మధ్య సికొర్స్కీ ఎయిర్‌క్రాఫ్ట్ సంస్థ నిర్మించినట్లు తెలిపింది.
ఇదీ చూడండి: బంగారు గనిలో పేలుడు.. 56మంది మృతి