అమెరికాలో కరోనా మరణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మహమ్మారి కారణంగా 24 గంటల్లోనే 1,973మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క రోజులో ఇన్ని మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. మొత్తం మృతుల సంఖ్య 14,695కు చేరి స్పెయిన్‌ను అధిగమించింది. ఇప్పటివరకు 4,35,128 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న న్యూయార్క్ నగరంలో 6,200 మంది మృతిచెందగా, కేసుల సంఖ్య 1,50,000 దాటింది.
కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వైరస్‌ను కట్టడి చేయగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. రానున్న కొద్ది రోజులు భయంకరంగా ఉంటాయని, ఆ తర్వాత అద్భుతమైన రోజులు తిరిగి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ముందుగా అంచనా వేసినట్టు వైరస్ కారణంగా 1 నుంచి 2లక్షల మంది చనిపోయే అవకాశం లేదని స్పష్టం చేశారు. వైరస్ నియంత్రణకు ప్రభుత్వం సూచనల మేరకు ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని ప్రజలను కోరారు ట్రంప్.
కరోనా పరీక్షలకు అనుమతి..
కరోనా కేసులను వేగంగా గుర్తించేందుకు అమెరికాలో ఔషధ దుకాణాలకు పరీక్షలు నిర్వహించేందుకు అనుమతిచ్చింది ప్రభుత్వం. యాంటీ బాడీ పరీక్షలకు కూడా అంగీకారం తెలిపింది.
ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికాలో ఇప్పటివరకు 19 లక్షల మందికిపైగా కరోనా పరీక్షలు నిర్వహించారు.