కరోనా కారణంగా అగ్రరాజ్యం అమెరికా గజగజలాడుతోంది. ఇప్పటికే 4 లక్షల మందికిపైగా వైరస్ బారిన పడగా.. 14,210 మంది కరోనాతో మరణించారు. ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ దేశాలు కొవిడ్-19 దెబ్బకు విలవిల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా, చైనాలు ఏకమై కరోనాతో పోరాడాలని పిలుపునిచ్చింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ). అంతర్జాతీయ ఐక్యత లేకపోవడం వల్ల మరణాలు మరింత పెరిగే ప్రమాదముందని హెచ్చరించింది.
నిప్పుతో చెలగాటమే!
'ప్రపంచ దేశాలకు బద్ధ శత్రువైన కొవిడ్-19కు వ్యతిరేకంగా పోరాడటానికి అమెరికా, చైనా ఒక్కటవ్వాలని' డబ్ల్యూహెచ్ఓ అధ్యక్షుడు టెడ్రోస్ అధనామ్ అన్నారు. వైరస్‌పై రాజకీయాలు చేయకుండా ప్రజల పాణాలు రక్షించడానికి అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సమయం వృథా చేస్తే నిప్పుతో చెలగాటం ఆడినట్లేనని వ్యాఖ్యానించారు. డబ్ల్యూహెచ్ఓకు ఇప్పటివరకు నిధులు సమకూర్చినందుకు అమెరికాకు కృతజ్ఞతలు తెలిపారు టెడ్రోస్. ఇకముందు అగ్రరాజ్యం సహాయాన్ని కొనసాగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ట్రంప్ ఆగ్రహం ఫలితమే!
ప్రపంచ ఆరోగ్య సంస్థపై తీవ్ర ఆరోపణలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. డబ్ల్యూహెచ్ఓకు తాము ఇవ్వాల్సిన నిధులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే రెండు దేశాలకు టెడ్రోస్ పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: కరోనా పోరాట నిధికి ప్రపంచ నాయకుల పిలుపు