ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్‌ను అమెరికా సంస్థకు అమ్మేందుకు.. బైట్‌డ్యాన్స్‌కు మరింత గడువు లభించింది. ఇప్పటికే ఉన్న డెడ్‌లైన్‌ను నవంబర్ 12నుంచి నవంబర్ 27 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ట్రంప్ ప్రభుత్వం. ఈ విషయాన్ని ఫెడరల్ కోర్టులో దాఖలు చేసిన ఓ పిటిషన్ ద్వారా స్పష్టమైంది. టిక్‌టాక్ సంస్థ 30 రోజుల గడువు కోరగా.. ట్రంప్ సర్కార్ 15 రోజులే గడువు ఇచ్చింది.
టిక్‌టాక్‌ను అమెరికన్ సంస్థలకు అమ్మాలని లేదంటే అగ్రరాజ్యంలో సంస్థ కార్యకలాపాలను పూర్తిగా మూసివేయాలని ట్రంప్ సర్కార్ ఎప్పటినుంచో ఒత్తిడి తెస్తోంది. చైనాకు చెందిన సంస్థ కాబట్టి టిక్‌టాక్‌తో తమ దేశ జాతీయ భద్రతకు ముప్పు వాటిళ్లే ప్రమాదం ఉందని, తమ వినియోగదారులపై చైనా గూఢచర్యం చేసే అవకాశం ఉన్నట్లు ట్రంప్ పరిపాలన విభాగం ఆరోపణలు చేస్తోంది.
సెప్టెంబర్ 27న జారీ చేసిన ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశాల ప్రకారం.. నవంబర్ 12నుంచి యాప్‌పై పూర్తిస్థాయిలో నిషేధం అమలు కావాల్సి ఉంది. అయితే.. గత నెలలో ఫెడరల్ జడ్జి ఆదేశాలతో అది కాస్తా వాయిదా పడింది.
రేసులో ఒరాకిల్!
టిక్‌టాక్ అమెరికా కార్యకలాపాలను ప్రముఖ అమెరికా సంస్థ ఒరాకిల్ సొంతం కానున్నట్లు సమాచారం. అయితే వీటిపై ఇప్పటికీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు ఇరు సంస్థలు. ఈ ఒప్పందం కొలిక్కి వస్తే, బైట్‌డ్యాన్స్‌లో ఒరాకిల్ సాంకేతిక భాగస్వామిగా ఉంటూ టిక్‌టాక్ సమాచారాన్ని నిర్వహిస్తుంది. అయితే మెజారిటీ యాజమాన్య హక్కులను మాత్రం తన వద్దే ఉంచుకునేందుకు బైట్‌డ్యాన్స్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.