ప్రపంచం తన గతిని మార్చుకునే చరిత్రాత్మక దిశ వద్ద నేడు ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అఫ్గానిస్థాన్‌లో యుద్ధాన్ని వీడి, దౌత్యశకాన్ని ప్రారంభించినట్టు చెప్పారు. కొవిడ్, వాతావరణ మార్పులు, మానవ హక్కుల ఉల్లంఘన తదితర సంక్షోభాలను సత్వరం, ఐక్యంగా దాటిపోవాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత... మంగళవారం ఐరాస సర్వసభ్య సమావేశంలో ఆయన తొలిసారి మాట్లాడారు. అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో- తాము మరో ప్రచ్ఛన్న యుద్ధాన్ని, ప్రపంచ విభజనను కోరుకోవడం లేదని స్పష్టం చేశారు.
మా దృష్టిని మళ్లించాం...
"అఫ్గాన్‌లో 20 ఏళ్ల యుద్ధాన్ని గత నెలలో ముగించాం. ప్రపంచ మానవాళి అభ్యున్నతికి కొత్త మార్గాల్లో సహాయం, పెట్టుబడులు సమకూర్చడంపై ఇక దృష్టి సారిస్తాం. ఇందుకు మా శక్తిని వినియోగిస్తాం. ప్రపంచ ప్రజాస్వామ్య పునరుద్ధరణకు, పరిరక్షణకు కొత్త శకాన్ని ఆరంభిస్తున్నాం. ఈ దిశగా దౌత్య ప్రతిభను ఉపయోగిస్తాం. మన సొంత ప్రజలను ముందుకు నడిపించాలంటే, మిగతా ప్రపంచంతోనూ మనం కలిసి నవవాలని బలంగా నమ్ముతాను. కొవిడ్ సంక్షోభాన్ని సమర్థంగా అధిగమించేందుకు, వాతావరణ మార్పుల ప్రభావం నుంచి మానవాళిని కాపాడేందుకు, ఉగ్రవాదాన్ని... వాణిజ్యం, సైబర్, కొత్త సాంకేతికత సవాళ్లను ఎదుర్కోవడానికి మా వనరులను, శక్తిని అంకితం చేస్తాం."
-జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
మనం సాధించగలం..
"'మెరుగైన భవిష్యత్తు'ను నిర్మించుకోవాలని మనం కాంక్షిస్తున్నాం. ఇందుకు మీకూ, నాకూ.. మనందరికీ సంకల్పం, సామర్థ్యం రెండూ ఉన్నాయి. లేడీస్ అండ్ జంటిల్మన్! దీన్ని మనం సాధించగలం. ఇక ఒక్క క్షణాన్ని కూడా వృథా చేయకూడదు. బాంబులు, బుల్లెట్లు మనల్ని కొవిడ్ నుంచి.. భవిష్యత్తులో తలెత్తే ప్రమాదకర వేరియంట్ల నుంచి మనల్ని కాపాడలేవు. సైన్స్, సమష్టి రాజకీయ సంకల్పంతోనే మహమ్మారిని మనం ఎదుర్కోవాలి." అని బైడెన్ పిలుపునిచ్చారు.
ఉగ్రవాదం... పెరట్లో ఉన్నా ఊరుకోం
"ప్రతి దేశానికి ఉగ్ర ముప్పు పొంచి ఉంది. దాని చేదు కాటు ఎలా ఉంటుదో మాకు తెలుసు. దాదాపు అందరికీ ఇది అనుభవమే. కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద జరిగిన ఉగ్రదాడిలో మేము 13 మంది అమెరికా హీరోలను కోల్పోయాం. సుమారు 200 మంది అమాయకులు కూడా మృతిచెందారు. ఉగ్రవాదం పెరటిలో ఉన్నా, సుదూరాన ఉన్నా... అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ దేశాలను కోరుతున్నా. అమెరికాకు వ్యతిరేకంగా ఉగ్ర చర్యలకు పాల్పడేవారిని వదిలిపెట్టం. మా నుంచి వారికి కచ్చితమైన బదులు తప్పదు" అని బైడెన్ పేర్కొన్నారు.
సందడిగా ఐరాస..
కొవిడ్ కారణంగా రెండేళ్లుగా బోసిపోయిన ఐరాస ప్రధాన కార్యాలయం... ప్రపంచ నేతల రాకతో మళ్లీ సందడిగా కనిపిస్తోంది. మంగళవారం ప్రారంభమైన ఐరాస సర్వసభ్య సమావేశాలు... ఈనెల 27 వరకూ జరుగుతాయి. తొలిరోజు సమావేశానికి పెద్దసంఖ్యలో నేతలు హాజరయ్యారు. ప్రపంచం కొవిడ్‌తో పాటు సంఘర్షణలను, వాతావరణ మార్పులను ఎదుర్కొంటోందని, కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన మలుపు వద్ద ఉందని 76వ సెషన్స్ అధ్యక్షుడు అబ్దుల్లా షాహిద్ పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తి కారణంగా గత ఏడాది నేతలెవరూ సర్వసభ్య సమావేశాలకు రాలేదు. వారి వీడియో సందేశాలనే వినిపించారు. ఈసారి సమావేశాల్లో సుమారు వంద మంది నేతలు నేరుగా పాల్గొంటున్నారు.
ఇదీ చూడండి: UNGA 2021: 'తప్పుడు మార్గంలో వెళ్తున్నాం.. అగాధం అంచులో ఉన్నాం'