అమెరికాలో కరోనా వ్యాప్తి రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. కొద్ది రోజులుగా సగటున రోజుకు 2లక్షలకుపైగా కేసులు, 3వేలకు పైగా మరణాలతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. గురువారం నాటికి ఆ దేశంలో 10లక్షల మందికిపైగా ఆయా ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. వైద్య సదుపాయాల కొరత, సిబ్బంది లేమితో అక్కడి వైద్యాధికారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వైరస్ వ్యాప్తికి ముందు ఒక ఐసీయూ నర్సు ఇద్దరు రోగులను చూసుకునేవారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో క్రమం తప్పకుండా నలుగురు లేదా ఐదుగురిని పర్యవేక్షించాల్సి వస్తోంది. ఓవైపు.. రోగులకు సరిపడా పడకలు, ఇతర వైద్య సదుపాయాలు వేధిస్తుంటే.. మరోవైపు సిబ్బంది కొరత ఆందోళన కలిగిస్తోంది. రోగులకు చికిత్స అందించే నర్సులకూ కనీసం ప్రాథమిక వనరులూ లేవని తెలుస్తోంది. కరోనా పట్ల సరైన జాగ్రత్తలు పాటించక పోవడం సహా.. కొందరు నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్లే దేశంలో వైరస్ విజృంభిస్తోందని ఆవేదన చెందారు అక్కడి ఆరోగ్యకార్యకర్తలు.
న్యూయార్క్, పెన్సిల్వేనియాలో...
వైరస్ వ్యాప్తిని, ఆస్పత్రిలో రద్దీని నియంత్రించేందుకు గవర్నర్ ఆండ్రూ క్యూమో న్యూయార్క్ సిటీలో ఇండోర్ డైనింగ్‌పై నిషేధం విధించారు. అంతకమందు పెన్సిల్వేనియా గవర్నర్ టామ్ ఓల్ఫ్ సైతం ఇదే తరహా చర్యలు చేపట్టారు. అంతేకాకుడా.. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, క్రీడా ప్రాంగణాలు, జిమ్ కేంద్రాలు, థియేటర్లు, క్యాసినోలపై పూర్తి స్థాయి నిషేధం విధించారు ఓల్ఫ్.
3లక్షలు దాటిన మరణాలు
అగ్రరాజ్యంలో ఇప్పటివరకు 1కోటీ 62లక్షల 95వేల మందికిపైగా కొవిడ్-19 బారినపడ్డారు. వారిలో 3లక్షల 2వేల 750 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి: శ్వాస మార్గం ద్వారా వ్యాక్సినేషన్