అధ్యక్షుడిగా జో బైడెన్ అధికారం చేపట్టిన తర్వాత అమెరికా-చైనా మధ్య తొలిసారి ప్రత్యక్షంగా జరిగిన అత్యున్నత సమావేశం వాడీవేడిగా సాగింది. ఈ భేటీలో ఇరు దేశాలు, ప్రపంచం పట్ల భిన్నాభిప్రాయాలు వెల్లడించారు నేతలు.
అలస్కా వేదికగా జరుగుతోన్న రెండు రోజుల దౌత్య సమావేశాల తొలి రోజున అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్, జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివాన్, చైనా కమ్యూనిస్ట్ పార్టీ విదేశీ వ్యవహారాల చీఫ్ యాంగ్ జెయిచీ, విదేశాంగ మంత్రి వాంగ్ యీ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ దేశాల విధానాలను సమర్థించుకునేందుకే ప్రాధాన్యమిచ్చారు నేతలు.
కొత్త పరీక్ష..
ఈ సమావేశం ఇరు దేశాల మధ్య క్షీణిస్తున్న సంబంధాలకు ఒక కొత్త పరీక్షగా నిలిచింది. రెండు దేశాల మధ్య వాణిజ్యం నుంచి టిబెట్, హాంగ్‌కాంగ్, షింజియాంగ్తో పాటు తైవాన్‌లో మానవ హక్కులు, దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడు, కరోనా వైరస్ వంటి కీలక అంశాలపై విభేదాలు ఉన్నాయి.
పోటాపోటీగా ఆరోపణలు..
చైనా విస్తరణవాదం, అధికార దాహాన్ని అణచివేసేందుకు అమెరికా తన భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేస్తుందని బ్లింకెన్ తెలిపారు. ప్రపంచ స్థిరత్వాన్ని దెబ్బతీసేలా చైనా చర్యలు ఉన్నాయని ఆరోపించారు. షింజియాంగ్, హాంగ్‌కాంగ్, తైవాన్ సహా అమెరికాలో సైబర్ దాడులు వంటి వాటిని ప్రస్తావించారు. అవి కేవలం అంతర్గత విషయాలు కాదని, అందుకే వాటిని లేవనెత్తాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.
అమెరికా వాదనలపై దీటుగా స్పందించారు యాంగ్. మానవ హక్కులు, ఇతర అంశాల్లో బీజింగ్‌పై ఆరోపణలు చేసేందుకు అమెరికా కుటిల బుద్ధిని చూపుతోందని దుయ్యబట్టారు. అమెరికా తన సొంత ప్రజాస్వామ్యాన్ని ఇతర దేశాలపై రుద్దటం మానుకోవాలని హితవు పలికారు. స్వదేశంలో మానవహక్కుల సమస్యను పరిష్కరించుకోవటంలో అమెరికా విఫలమైందని ఆరోపించారు. అమెరికా ప్రజాస్వామ్యంపై సొంత పౌరులకే విశ్వాసం సన్నగిల్లుతోందని విమర్శించారు. అనవసరంగా చైనాపై అబాండాలు వేస్తే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. కొద్ది కాలంగా జరిగిన పరిణామాలు ఇరు దేశాలకు తీరని నష్టాన్ని మిగిల్చాయని సూచించారు. చైనా గొంతు నొక్కేందుకు అవకాశమే లేదని స్పష్టం చేశారు.
బ్లింకెన్ చురకలు..
సుమారు 10 నిమిషాలు మాట్లాడిన యాంగ్ స్వరంలో తీవ్రతను చూసి బ్లింకెన్ కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపించింది. ప్రపంచ నాయకులతో మాట్లాడిన తీరుతో పోలిస్తే.. చైనాతో భిన్నంగా ఉందని చురకుల అంటించారు బ్లింకెన్. అమెరికా తిరిగి తన స్థానంలోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
ముందుగా అనుకున్నట్లుగా 2 నిమిషాల్లో యాంగ్ ప్రసంగం ముగించాలన్న ఒప్పందాన్ని ఉల్లంఘించటంపై విమర్శలు గుప్పించింది అమెరికా విదేశాంగ విభాగం.
ఎటూ తేల్చని బైడెన్..
అమెరికా-చైనా మధ్య సంబంధాలు కొన్నేళ్లుగా అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ బాధ్యతలు చేపట్టినప్పటికీ.. మాజీ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలపై ఇప్పటికీ ఎలాంటి సూచనలు చేయలేదు. విదేశాంగ మంత్రుల సమావేశానికి ఒక రోజు ముందే.. హాంగ్‌కాంగ్‌లో నిరసనకారులపై చైనా చర్యలను విమర్శిస్తూ కొత్త ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు బ్లింకెన్. దానిని తిరస్కరించింది చైనా. తమ అంతర్గత వ్యవహారంలో చైనా జోక్యం చేసుకోవటం తగదని హితవు పలికింది.
ఇదీ చూడండి: 'బైడెన్ వ్యాఖ్యలు అమెరికా గత చరిత్రకు నిదర్శనం'