చైనాలో మైనారిటీలపై ఆ దేశ ప్రభుత్వం మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని అమెరికా ఆరోపించింది. జాతి వివక్ష రూపుమాపేందుకు నిర్వహించే అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఐరాస సాధారణ మండలిలో ఆ దేశంపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో మాట్లాడిన అమెరికా రాయబారి లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్.. జాతి వివక్ష అనేది ప్రతి చోట ఉందని పేర్కొన్నారు.
"బానిసత్వం అనేది అమెరికా చేసిన అపరాధాల్లో ఒకటి. శ్వేతజాతీయులు ఆధిపత్యవాదులు, నల్లజాతీయులు నిమ్న స్థాయి వారనే భావన కలిగించింది. ఈ జాతి వివక్ష ఇప్పటికీ కొనసాగుతుండటం బాధాకరం. ప్రతి చోట ఈ సమస్య మనకు సవాల్‌గా మారింది. మయన్మార్ వంటి చోట్ల ఇది ఇంకా ప్రమాదకరంగా ఉంది. లక్షలాది మంది రోహింగ్యాలను అణచివేశారు. వేలాది మందిని హతమార్చారు. చైనాలో ప్రభుత్వమే మారణహోమానికి పాల్పడుతోంది. షింజియాంగ్‌లోని ఉయ్గుర్లు, ఇతర మతపరమైన మైనారిటీల పట్ల వివక్ష చూపుతోంది."
-లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్, అమెరికా రాయబారి
అమెరికాలో అనేక సమస్యలు ఉన్న విషయాన్ని తాము గుర్తిస్తున్నట్లు తెలిపారు థామస్. వాటిని పరిష్కరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
రాజకీయ ప్రేరేపితం: చైనా
కాగా, థామస్ వ్యాఖ్యలను పూర్తిగా ఖండించారు ఐరాసలోని చైనా డిప్యూటీ రాయబారి డాయి బింగ్. ప్రసంగించే సభ్యుల జాబితాలో ఆయన పేరు లేకపోయినా.. సభలో మాట్లాడారు. అమెరికా చేసిన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని అన్నారు. తమపై పదేపదే పుకార్లు వ్యాప్తి చేస్తున్నారని ధ్వజమెత్తారు. చైనా అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందన్నారు. అమెరికా వ్యాఖ్యలు పూర్తిగా అబద్దాలేనని.. నిజమే ఎప్పటికైనా విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చారు.
"మానవహక్కుల విషయంలో అమెరికా నీచమైన చరిత్రను ఆ దేశ రాయబారి గుర్తించారు. అంతమాత్రాన ఇతరదేశాలు ఏం చేయాలి అని హితబోధ చేసేందుకు వారికి హక్కు లభించినట్లు కాదు. ముందుగా మీ సైద్ధాంతిక పక్షపాతాన్ని విడిచిపెట్టండి. రాజకీయ ప్రయోజనాల కోసం, ఘర్షణలకు ఆజ్యం పోసేందుకు, అంతర్జాతీయ సహకారానికి విఘాతం కలిగించేందుకు మానవహక్కుల అంశాన్ని ఉపయోగించడం ఆపండి. ఆఫ్రికా, ఆసియా సంతతి వ్యక్తులపై కొనసాగుతున్న నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు వాస్తవిక చర్యలు చేపట్టండి."
-డాయి బింగ్, ఐరాసలో చైనా డిప్యూటీ రాయబారి
ఇటీవల జరిగిన అమెరికా, చైనా మంత్రుల సమావేశంలోనూ ఇరువురు ఒకరిపై మరొకరు పోటాపోటీ ఆరోపణలు చేసుకున్నారు. చైనా విస్తరణవాదానికి వ్యతిరేకంగా అమెరికా అధికారులు మాట్లాడారు. షింజియాంగ్, హాంకాంగ్, తైవాన్ సహా అమెరికాలో సైబర్ దాడుల అంశాలను ప్రస్తావించారు. వీటికి చైనా అధికారులు దీటుగా బదులిచ్చారు.
ఇవీ చదవండి: