అమెరికాలో జననాలు గతేడాది తగ్గిపోయాయి. 35 ఏళ్లల్లో ఎన్నడూ లేని విధంగా జననాల సంఖ్య పడిపోయింది. కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
కారణాలేంటీ..?
అమెరికాలో దశాబ్ద కాలం నుంచి జననాలు తగ్గుముఖం పట్టాయి. ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్తుపై అనిశ్చితి కారణంగా పిల్లల విషయంలో దంపతులు వెనకడుగు వేస్తున్నారని ఎమోరి విశ్వవిద్యాలయం ఛైర్ ఆఫ్ అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలాజీ డా. డెనిసీ జేమిసన్ తెలిపారు.
ఈ ప్రాథమిక నివేదికను అమెరికాలోని రోగ నియంత్రణ, నిరోధక కేంద్రం (సీడీసీ) విడుదల చేసింది. 2019లో జారీ చేసిన 99 శాతం జనన ధ్రువీకరణ పత్రాలను సమీక్షించి ఈ నివేదికను రూపొందించింది.
2018తో పోల్చితే.. 2019లో శిశు జననాల రేటు 1శాతం (37లక్షలు) తగ్గిందని సీడీసీ గుర్తించింది.
2014 మినహా... 2007 (మాంద్యం సమయం) నుంచి జననాల రేటు తగ్గుముఖం పట్టింది. మాంద్యం ముగిసి.. ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నా పరిస్థితులు మారలేదు.
ఇప్పటికీ అగ్రరాజ్యంలో అనేక మందికి వేతనం తక్కువ. ఉద్యోగాలపై అనిశ్చితి నెలకొంది. అద్దెలు ఎక్కువ. ఈ కారణాలతో పిల్లల విషయంలో దంపతులు, ముఖ్యంగా మహిళలు పునరాలోచనలో పడుతున్నారు.
కరోనా వల్ల...
ఇప్పటికే పడిపోతున్న జననాల రేటుపై కరోనా ప్రభావం భారీగా ఉండే అవకాశముందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే కరోనా వల్ల జననాల సంఖ్య తగ్గడం ముఖ్య విషయం కాదని.. వైరస్ ప్రభావం వల్ల నెలకొన్న అనిశ్చితి ఎంత కాలం ఉంటుందన్నదే అసలు సమస్యని మరికొందరు అంటున్నారు.