బిలియనీర్ల యుగం ఇది. నాలుగేళ్ల క్రితం అమెరికా తొలిసారిగా బిలియనీర్ డొనాల్డ్ ట్రంప్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకుంది. అప్పటి నుంచి ఆ దేశంలో ఉన్న ధనికులు మరింత ధనవంతులయ్యారని బ్లూమ్‌బెర్గ్ ఇండెక్స్ తెలియజేస్తోంది. ఆ దేశంలోని 200 మంది అగ్రశ్రేణి బిలియనీర్ల సంపద రూ. 75 లక్షల కోట్ల (ట్రిలియన్ డాలర్ల) మేర పెరిగిందని వెల్లడిస్తోంది.
ట్రంప్ అధికారంలోకి రాకమునుపే బిలియనీర్ల సంఖ్యలో అమెరికా ప్రపచం దేశాలన్నింటిలో అగ్రభాగాన ఉంది. ఆ విషయాన్ని ఇలా ఉంచితే.. మళ్లీ ఇప్పుడు అమెరికా ఎన్నికల ముంగిట నిలిచింది. ఆ ఫలితాలు దేశ ఆర్థిక, రాజకీయ భవితవ్యాన్నే కాదు అక్కడి బిలియనీర్ల అదృష్ట రేఖనూ నిర్ణయించనున్నాయి.
తాను అధికారంలోకి వస్తే ధనికులపై మరింతగా పన్నులు విధిస్తానని డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి డో బైడెన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో బైడెన్ గెలిస్తే పన్నుల భారం నుంచి తప్పించుకొనే మార్గాల విషయంలో శ్రీమంతులందరూ ముందస్తు జాగ్రత్తల్లో ఉన్నారట. ఎవరు అధికారంలోకి వచ్చినా సాంకేతిక పరిజ్ఞానమే అమెరికా ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను ప్రభావితం చేస్తుందనేది తిరుగులేని వాస్తవం.
2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగిన రోజున అమెరికాలో 200 మంది అగ్రశ్రేణి బిలియనీర్ల సంపద విలువ దాదాపు రూ.133 లక్షల కోట్లు (1.8 ట్రిలియన్ డాలర్లు)గా ఉండేది. ప్రస్తుతం పోలింగ్ తేదీకి వారం రోజుల ముందు వారి సంపద విలువ రూ.208 లక్షల కోట్లు (2.8 ట్రిలియన్ డాలర్లు)కు పైగా ఉందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న 500 మంది బిలియనీర్ల సంపదలో హెచ్చుతగ్గులు నిత్యం తెలియజేసే బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది.
- ఇదీ చూడండి: మేం దూసుకుపోతున్నాం.. గెలుపు నాదే: ట్రంప్