తైవాన్‌కు బిలియన్ డాలర్ల విలువగల అత్యాధునిక ఆయధాలను అమ్మేందుకు అమెరికా అంగీకరించింది. తైవాన్ ఆక్రమణకు చైనా సన్నద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో అమెరికా చర్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అదే సమయంలో ఈ నిర్ణయం వల్ల అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. కరోనా సంక్షోభం, హాంగ్‌కాంగ్, వాణిజ్య ఒప్పందం, దక్షిణ చైనా సముద్ర వ్యవహారాలపై ఇరు దేశాల మధ్య బంధం ఇప్పటికే బలహీనపడింది.
భూమిపై దాడులు చేసే 135 మిసైళ్లు, అందుకు సంబంధించిన పరికరాలను అమ్మడానికి పచ్చజెండా ఊపినట్టు అమెరికా అధికారులు వెల్లడించారు. దీనితో పాటు తమ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు తైవాన్‌కు పలు కీలక విభాగాల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు.
తమ దేశ భద్రతను మెరుగుపరుచుకునేందుకు, రాజకీయంగా స్థిరత్వం పొందేందుకు ఈ ఆయుధాల ప్యాకేజీ తైవాన్‌కు ఉపయోగపడుతుందని అమెరికా ఆశాభావం వ్యక్తం చేసింది.
తైవాన్‌పై ఆధిపత్యం చెలాయించేందుకు గత కొన్నేళ్లుగా చైనా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో తైవాన్‌కు అమెరికా ఇప్పటికే అనేకమార్లు అందించిన సహాయంపై చైనా తీవ్రస్థాయిలో మండిపడింది.
ఇదీ చూడండి:- తైవాన్‌తో సన్నిహిత సంబంధం చారిత్రక అవసరం!