తన వద్ద అవసరానికంటే అధికంగా మిగిలిపోయిన 8 కోట్ల డోసుల టీకాలను ప్రపంచ దేశాలకు పంచటానికి అమెరికా ముందుకొచ్చింది. తొలి విడతగా 2.5 కోట్ల డోసుల్లో 1.9 కోట్ల డోసులను దక్షిణ ఆసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాలకు అందజేస్తారు. వీటిలో 60 లక్షల డోసులను లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాలకు, 70 లక్షల టీకాలను దక్షిణాసియా, ఆగ్నేయాసియాకు పంపి.. ఆఫ్రికాకు 50 లక్షల డోసులు సరఫరా చేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గురువారం ప్రకటించారు.
మిగిలిన 60 లక్షల టీకాలను కొవిడ్ అధికంగా ఉన్న, తీవ్రంగా దెబ్బతిన్న దేశాలైన భారత్, మెక్సికోలతో పాటు తమ పొరుగుదేశం కెనడా, మిత్రదేశం దక్షిణ కొరియాలకు నేరుగా పంపిస్తామని బైడెన్ వివరించారు.. ఈ నేపథ్యంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భారత ప్రధాని నరేంద్రమోదీతో ఫోన్‌లో మాట్లాడి... వ్యాక్సిన్లను పంపించే వివరాలను పంచుకున్నారు. కొవిడ్ వ్యాక్సిన్లు తయారవుతున్నప్పుడే... అమెరికా తన అవసరాలకంటే ఎక్కువగా ఆర్డర్లు ఇచ్చింది. తమ మొత్తం జనాభాకు టీకాలు పూర్తయినా కూడా భారీ స్థాయిలో... (సుమారు 8 కోట్లు) మిగిలిపోయేంతగా నిల్వలు సమకూర్చుకుంది. వృథాగా వాటిని నిల్వ ఉంచుకోవటంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో బైడెన్ ప్రభుత్వం మిగులు టీకాలను ప్రపంచానికి పంచాలని నిర్ణయం తీసుకుంది.
భారత్‌కు అధిక ప్రయోజనం..
అమెరికా టీకాలు భారత్‌కు అందనున్నట్లు ఆ దేశంలోని భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధు తెలిపారు. ఒకటి కొవాక్స్ ద్వారా కాగా.. మరొకటి నేరుగా పొరుగు, మిత్ర దేశాలకు అందించే మార్గాన అని వెల్లడించారు. తొలుత కొవాక్స్ ద్వారా భారత్‌కు టీకాలు రానున్నట్లు పేర్కొన్నారు. అలాగే రక్షణ ఉత్పత్తుల చట్టం నుంచి కొన్ని సడలింపులు ప్రకటించడం ద్వారా ఇకపై నొవావాక్స్, ఆస్ట్రాజెనెకా టీకాల సరఫరా సాఫీగా సాగనున్నట్లు అభిప్రాయపడ్డారు.
రక్షణ ఉత్పత్తుల చట్టంలో సడలింపులు..
టీకాల ఎగుమతులకు అనుగుణంగా అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 'రక్షణ ఉత్పత్తుల చట్టం' అమల్లో ఉండడంతో అమెరికాలో ఉత్పత్తి అయిన టీకాలను ఇతర దేశాలను ఎగుమతి చేయడంపై నిషేధం కొనసాగింది. తాజాగా అందులో మార్పులు చేస్తూ శ్వేతసౌధం ప్రకటన జారీ చేసింది. ఆస్ట్రాజెనెకా, నొవావాక్స్, సనోఫీ వ్యాక్సిన్ల ఎగుమతులపై ఉన్న ఆంక్షలను సడలిస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై వ్యాక్సిన్లను అందించే ప్రాథమ్యాలను ఈ టీకాలను తయారు చేస్తున్న సంస్థలే నిర్ణయించుకోవచ్చు.
ఇవీ చదవండి:Green Card: ఆ పరిమితి తొలగింపునకు బిల్లు