అమెరికాలో గర్భవిచ్ఛిత్తిపై నిషేధాజ్ఞలు విధించిన రిపబ్లిక్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అబార్షన్ హక్కుల కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. గర్భస్రావానికి చట్టబద్ధత కల్పిస్తూ 1973లో అగ్రరాజ్య సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు.. ప్రభుత్వ నిర్ణయంతో నిర్వీర్యం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
అబార్షన్లపై నిషేధం విధిస్తూ అమెరికాలోని దక్షిణ రాష్ట్రం అలబామా ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. ఇందులో మహిళ పరిస్థితి విషమిస్తే తప్ప... అత్యాచారానికి గురైన వారికీ మినహాయింపు కల్పించలేదు. అలబామాలో నిషేధం విధించిన వారం రోజుల అనంతరం దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, అట్లాంట, జార్జియా రాష్ట్రాల్లోనూ పలువురు నిరసనలు చేపట్టారు.
అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని సుప్రీంకోర్టు ఎదుట వందల మంది కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. 24 వారాల్లోపు పిండాన్ని తొలగించేందుకు ఉన్న అవకాశాన్ని కాపాడాలని న్యాయమూర్తులను కోరారు.
గతేడాది నవంబర్‌లో అబార్షన్‌ను హత్యలుగా పరిగణిస్తూ... గర్భవిచ్ఛిత్తి చేసిన వైద్యులపై 10 నుంచి 99 ఏళ్లు శిక్ష విధించేలా కఠిన చట్టం చేసింది. ఈ నెల ప్రారంభంలో జార్జియాలోనూ అబార్షన్‌పై నిషేధ చట్టం తీసుకొచ్చారు.
ఇదీ చూడండి: పార్లమెంట్ ముందుకు కొత్త బ్రెగ్జిట్ ఒప్పందం