అమెరికాను కరోనా వణికిస్తోంది. కేసులు, మరణాలు ఏ మాత్రం తగ్గడం లేదు. మరోసారి అక్కడ 24 గంటల వ్యవధిలో 30 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 3176 మంది కరోనా కారణంగా మరణించినట్లు జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం వెల్లడించింది. దేశంలో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 49 వేల 845కు చేరింది.
అమెరికాలో మొత్తం కరోనా కేసులు 8 లక్షల 80 వేలకుపైనే. ఇందులో సుమారు 86 వేల మంది కోలుకోగా.. 7 లక్షల 44 వేలకుపైగా యాక్టివ్ కేసులున్నాయి.
మొత్తం కేసులు, మరణాల్లో న్యూయార్క్‌లోనే అధిక భాగం ఉన్నాయి. అయితే.. ఇక్కడ కొద్ది రోజులుగా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది.
సాధారణ స్థితికి...
ఇళ్లలోనే ఉండాలంటూ విజ్ఞప్తి చేస్తూ వచ్చిన ట్రంప్ సర్కారు... సాధారణ కార్యకలాపాలను ప్రారంభించాలని ప్రజలను కోరుతోంది. అదే సమయంలో.... వ్యక్తిగత దూరం పాటించాలని స్పష్టం చేసింది. వైరస్ కట్టడికి తాము అనుసరిస్తున్న విధానాలు సత్ఫలిస్తున్నాయని అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు.
అమెరికాలో నిరుద్యోగులకు కల్పించే ప్రయోజనాల కోసం... తాజాగా మరో 44 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఫలితంగా.. కరోనా సంక్షోభం మొదలైనప్పటి నుంచి అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య 2.6 కోట్లకు పెరిగింది.