అగ్రరాజ్యంలో కరోనా తన విస్తృతిని పెంచుకుంటూ పోతోంది. రోజురోజుకూ కేసులు, మరణాలు అధికంగా నమోదవుతున్నాయి. కరోనా కారణంగా అమెరికాలో ఇప్పటివరకు 39 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 7 లక్షల 38 వేలు దాటింది.
జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లోనే అక్కడ 1891 మంది కరోనాకు బలయ్యారు. దాదాపు మరో 30 వేల కేసులు పుట్టుకొచ్చాయి.
న్యూయార్క్లో తొలిసారి..
అమెరికాలో కరోనాకు కేంద్రబిందువుగా ఉన్న న్యూయార్క్లో తొలిసారి కరోనా మరణాల సంఖ్య తగ్గింది. గడిచిన 24 గంటల్లో అక్కడ 540 మంది మరణించినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరణాలు 550 లోపు నమోదవడం గత రెండు వారాల్లో ఇదే తొలిసారి కావడం విశేషం.
ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని, వైరస్ క్షీణిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో. అయితే.. మరిన్ని రోజులూ విషాదంగానే ఉండనున్నాయని, మరణాలు భారీగానే నమోదవ్వొచ్చని అన్నారు.
ఈ నగరంలోనే దాదాపు లక్షా 22 వేల మందికిపైగా వైరస్ సోకింది. మరో 12 వేల మందికిపైగా మరణించారు.
న్యూజెర్సీ, మసాచుసెట్స్, కాలిఫోర్నియా, ఫ్లోరిడా, లూసియానాల్లోనూ బాధితులు పెద్దసంఖ్యలో ఉన్నారు.