Woman marries pink colour: ప్రేమకు కులం, మతం, ప్రాంతం, భాష, వర్ణంతో సంబంధం లేదని ఎన్నో సందర్భాల్లో నిరూపితమైంది. ఒక దేశం అమ్మాయి.. మరో దేశం అబ్బాయి పెళ్లి చేసుకోవడం.. వయసులో తనకంటే చిన్నవాడిని వివాహం చేసుకున్న అమ్మాయిలను చూశాం. కానీ, ఇప్పుడు మనం తెలుసుకునే అమ్మాయి.. ఎవరిని పెళ్లి చేసుకుందో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే ఆమె.. తన కిష్టమైన ఓ రంగునే వివాహమాడింది. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని లాస్ వెగాస్‌కు చెందిన కిట్టెన్ కే సెరా అనే మహిళకు పింక్ కలర్ (గులాబీ రంగు) అంటే ఎంతో ఇష్టమట. 40 ఏళ్లుగా పింక్ కలర్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని అంటోంది ఈమె. నూతన సంవత్సరం సందర్భంగా జనవరి ఒకటో తేదీన బంధుమిత్రుల సమక్షంలో పింక్ కలర్‌ని పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. ఆ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇంకో విశేషమేమిటంటే.. సెరా తన పెళ్లి వేడుకలో ధరించిన దుస్తులు కూడా గులాబీ రంగులోనే ఉన్నాయి. జుట్టుకు కూడా పింక్ రంగునే వేసుకుంది. ఆమె ధరించిన నగలు, లిప్‌స్టిక్, మ్యారేజ్ రింగ్, కేక్ ఇలా ప్రతి అలంకరణ వస్తువు కూడా పింకే. వివాహానికి హాజరైన వారు కూడా గులాబీ రంగు దుస్తులనే ధరించడం విశేషం.
నిత్యం పింక్ కలర్లోనే కనిపించే ఈ ముద్దుగుమ్మను చూసి ఒకరోజు స్కేట్ బోర్డుపై ఉన్న ఓ చిన్న పిల్లాడు ఆమెను ఈ విధంగా ప్రశ్నించాడట. 'నీకు పింక్ కలర్ అంటే ఇష్టం కదా' అని ప్రశ్నించగా.. అవునన్నట్టు సెరా చిన్నగా నవ్విందట. 'అయితే పింక్ కలర్‌నే పెళ్లి చేసుకోవచ్చు కదా' అని ఆ బాలుడు ప్రశ్నించాడట. అప్పుడే గులాబీ రంగుని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందా? ఆలోచన చేసిందట సెరా. ఇందులో మరో విశేషం కూడా ఉందండోయ్..! పెళ్లయ్యాక వేరే వ్యక్తిని కన్నెత్తి చూడనని.. తాను చనిపోయేవరకూ పింక్ కలర్ డ్రెస్సులు తప్ప వేరే రంగు దుస్తులను ధరించనని పెళ్లి వేడుకలో ఈ పింక్ క్వీన్ ప్రమాణం చేసింది.
ఇదీ చూడండి: